Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేటీఆర్ ఇక మారరా ?

గులాబీ పార్టీకి ఇద్దరు బాసులు. ఒకరు సర్వసత్తాక అధికారి కేసీఅర్. మరొకరు భావి చక్రవర్తిగా నిన్నటిదాక పార్టీ నేతలు చెప్పుకునే కేటీఆర్

By:  Tupaki Desk   |   20 April 2024 3:30 PM GMT
కేసీఆర్ కేటీఆర్ ఇక మారరా ?
X

గులాబీ పార్టీకి ఇద్దరు బాసులు. ఒకరు సర్వసత్తాక అధికారి కేసీఅర్. మరొకరు భావి చక్రవర్తిగా నిన్నటిదాక పార్టీ నేతలు చెప్పుకునే కేటీఆర్. ఇపుడు బీఆర్ స్ పార్టీకి ఈ ఇద్దరే ఏకైక పెద్ద దిక్కు. పార్టీ ఓడితే నేతలు అన్న వారు అంతా జారిపోతున్నారు. కేసీఆర్ కి కేటీఆర్ కి కుడి భుజాలు అనదగ్గ నాయకులు కూడా ఒవర్ నైట్ హ్యాండ్ ఇస్తున్నారు.

పార్టీ మీదే మీ ఇష్టం వచ్చినట్లు చేశారు. మమ్మల్ని మర బొమ్మలను చేశారు అందుకే మేము బయటకు పోతున్నామని బండలేసి మరీ వెళ్తున్నారు. దాంతో బీఆర్ఎస్ దశ దిశ ఎలా అన్నది ఒక చర్చగా ఉంది. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ అత్యంత బలాఢ్యుడుగా కనిపించారు. అలాగే కేటీఆర్ కూడా కాబోయే సీఎం. ఆయనదే ఆలస్యం అన్నట్లుగా కధ నడచింది.

ఓటమి తరువాత చూస్తే తండ్రీ కొడుకులకు గులాబీ దళం అందకుండా పోతోంది. అయితే వాస్తవాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న వేళ ఓటమి జరిగి అయిదు నెలలు దగ్గరపడుతున్న వేళ ఆత్మ పరిశీలన అసలైన సమీక్ష అన్నది బీఆర్ఎస్ చేసుకుందా అన్నదే ప్రశ్నగా ఉంది.

ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో కనీసంగా నాలుగైదు ఎంపీ సీట్లను అయినా గెలుచుకోకపోతే బీఆర్ఎస్ మనుగడకే ప్రమాదం అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న పెద్దపల్లి పార్లమెంట్ మీద సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలు వచ్చిన వారు అంతా ఓడిపోయిన ఎమ్మెల్యేలే.

కానీ కేసీఆర్ కేటీఆర్ మాత్రం మనకు పిఠాపురం వాళ్ళు సర్వే ఇచ్చారు. పెద్దపల్లి సీటుని మనమే గెలవబోతున్నామని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. మొత్తం పెద్దపల్లి ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో ఓడిపోయి ఇంచార్జిలుగా ఉన్న వారికి కేసీఆర్ కేటీఆర్ గెలుపు మనదే అని చెప్పారని అంటున్నారు.

దీంతో అక్కడకి వచ్చిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు అని అంటున్నారు. ఎందుకంటే పెద్దపల్లి లో గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా బీఆర్ఎస్ కి లేరు. కానీ ఎంపీ సీట్ లో మనమే గెలుస్తున్నామని చెప్పడమేంటి అని వారు అంటున్నారుట.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎటూ దొంగ సర్వేల మీద ఆధారపడి ఓటమి కొని తెచ్చుకున్నామని ఇపుడు కూడా అలాంటి సర్వేలనే నమ్ముకుని రాజకీయం చేయడమేంటి అని మాజీ ఎమ్మెల్యేలే అంటున్న నేపధ్యం ఉందిట. ఇక 2023 లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీలో ఒక పెద్ద నేత ఇచ్చిన సర్వే రిపోర్టులను పట్టుకుని పుట్టె ముంచుకున్నామని బీఆర్ఎస్ నేతలే అంటున్నారుట.

ఒక ఎన్నికలో ఘోర పరాభవం వచ్చినా కూడా ఇంకా గుణపాఠాలు నేర్చుకుని నిజమైన సమీక్షలు చేసుకుని తప్పులు దిద్దుకునే పరిస్థితి ఉండదా అని కూడా అంటున్నారుట. ఇక కేసీఆర్ కేటీఆర్ అయితే మారేది ఉండదా అన్నది గులాబీ దళంలో గట్టిగా వినిపిస్తున్న మాట అని అంటున్నారు.

దొంగ సర్వేలను నమ్ముకుంటే ఎప్పటికీ ఓటమే దక్కుతుందని అంటున్నారుట. పార్టీని నిలబెట్టే చర్యలు తీసుకోవాలని అలాగే మభ్యపెట్టే వైఖరి నుంచి బయటపడాలని సూచిస్తున్నారుట. నిజమైన సర్వేలు ఏవైనా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.

ఓటమి పాలు అవుతామని చెబుతున్న సర్వేలను దగ్గర పెట్టుకుని లోపాలు ఎక్కడ ఉన్నాయో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటేనే ఏ రాజకీయ పార్టీకి అయినా భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా గెలుస్తున్నామని తాము నమ్ముతూ క్యాడర్ ని నమ్మిస్తూ పోతే అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ అయినా అవవచ్చు అని అంటున్నారుట.

సహజంగానే ఓటముల నుంచి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయని అంటున్నారు. కానీ నేతలు మాత్రం తమ తప్పు కాదు అన్నట్లుగా ఉంటారని, ఇపుడు బీఆర్ఎస్ లో అదే వాతావరణం ఉందని అంటున్నారు దాంతో కేసీఆర్ కేటీఆర్ మారాలని మాత్రం అంతా కోరుకుంటున్నారు. అది జరగనంత కాలం పార్టీ భవిష్యత్తు మీద బెంగ అలాగే ఉంటుందని అంటున్నారు.