Begin typing your search above and press return to search.

అదెలా? రోజులో లేచి కూర్చున్న కేసీఆర్?

ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్ ఏమంటే.. రెండు రోజుల వ్యవధిలో కేసీఆర్ తీరులో వచ్చిన మార్పును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:46 AM GMT
అదెలా? రోజులో లేచి కూర్చున్న కేసీఆర్?
X

ఫాంహౌస్ బాత్రూంలో జారి పడిన గులాబీ బాస్ కేసీఆర్ ఆసుపత్రి ఎపిసోడ్.. ఆ సందర్భంగా పరామర్శల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు అందరి కంటే ముందుగా స్పందించింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శ తర్వాత నుంచి విజిటర్స్ హడావుడి ఒక రేంజ్ లో పెరిగిన సంగతి తెలిసిందే.

కారణాలు ఏమైనా.. కాస్త కోలుకున్న తర్వాత వెళదామన్న ఉద్దేశంతో ఆగిన ప్రముఖులు ఉన్నారు. ఒకట్రెండు రోజుల తేడాతో ఈ మధ్యన ఇద్దరు ప్రముఖులు.. సన్నిహితులు కేసీఆర్ ను కలిసి.. ఆయన్ను పరామర్శించిన వైనం తెలిసిందే. అందులో ఒకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా.. మరొకరు మాజీ గవర్నర్ నరసింహన్. వీరిద్దరూ కాస్త తేడాతో కేసీఆర్ ను కలిసి.. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు.

ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్ ఏమంటే.. రెండు రోజుల వ్యవధిలో కేసీఆర్ తీరులో వచ్చిన మార్పును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం హైదరాబాద్ లోని నంది నగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు కూడా.. బెడ్ మీద పడుకొని ఉండటం.. ఆ మోడ్ లోనే ఏపీ సీఎంతో మాట్లాడటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోల్ని బీఆర్ఎస్ విడుదల చేసింది.

కట్ చేస్తే.. ఏపీ సీఎం జగన్ పరామర్శ చేసిన ఒకట్రెండు రోజులకే ఉమ్మడి రాష్ట్రానికి.. తెలంగాణ స్టేట్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వెళ్లటం.. మిగిలిన వారి కంటే ఎక్కువ సేపు వారితో గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మంచం మీద పడుకొని ఉండటం కాకుండా.. కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటోను విడుదల చేశారు. బాత్రూంలో జారి పడిన తర్వాత.. మళ్లీ కుర్చీలో కూర్చున్న ఫోటో మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే చోటు చేసుకుంది. అయితే.. రెండు రోజుల తేడాతోనే మంచం మీద నుంచి కుర్చీలోకి షిఫ్టు కావటం కొత్తగా ఉందంటున్నారు. మాజీ గవర్నర్ నరసింహన్ కుటుంబం పరామర్శకు వచ్చినప్పుడు ఎలా అయితే.. కూర్చొని మాట్లాడారో.. అదే రీతిలో ఏపీ సీఎం వచ్చినప్పుడు కూడా ఉంటే బాగుండేదంటున్నారు. రెండు రోజుల్లో కేసీఆర్ చూపిన వేరియేషన్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది.