Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆసుపత్రి వీడియోలు..కొత్త డౌట్లకు ఆన్సర్ ఇచ్చేదెవరు?

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కు తరలించే వేళ.. వీడియోల్ని తీసి మరీ షేర్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:53 AM GMT
కేసీఆర్ ఆసుపత్రి వీడియోలు..కొత్త డౌట్లకు ఆన్సర్ ఇచ్చేదెవరు?
X

అధికారంలో ఉన్నప్పుడు అస్సలు గుర్తుకు రాని ప్రజలు.. పవర్ చేజారినంతనే గుర్తుకు వచ్చేయటం.. భావోద్వేగాన్ని రగిలించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకపోవటం ఆసక్తికరంగానే కాదు.. అనేక ఎదురు ప్రశ్నలకు తెర తీసేలా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ల పాటు పరిపాలించిన సందర్భంగా వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రులకు వెళ్లటం తెలిసిందే.

అయితే.. ఎప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్లినా.. దానికి సంబంధించిన అధికారిక ప్రెస్ నోట్ కానీ.. వీడియో కానీ ఫోటోలు కాని బయటకు వచ్చేవి కావు. అందుకు భిన్నంగా ఎన్నికల్లో ఓడిన వారం లోపే.. ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడటం.. తుంటి మార్చే సర్జరీ జరగటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కు తరలించే వేళ.. వీడియోల్ని తీసి మరీ షేర్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎలాంటి వీడియోలు షేర్ చేయని కేసీఆర్ కు.. ఇప్పుడు మాత్రం ఎందుకు షేర్ చేస్తున్నారు? పవర్ చేజారినప్పుడే ప్రజలు.. ప్రజల భావోద్వేగాలు గుర్తుకు వస్తాయా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. టచ్ లో ఉండని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం చీమ చిటుక్కుమంటే చాలు.. ఫోటోల్ని.. వీడియోల్ని భారీగా విడుదల చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

సర్జరీ జరిగిన రెండో రోజున.. కేసీఆర్ ను నడిపించేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీటికి కేసీఆర్ అనుమతి లేకుండా బయటకు వచ్చేవి కావని.. అలా వచ్చాయంటే ఆయన అంగీకారం ఉందంటున్నారు. ఈ వీడియోలతో ప్రజల్లో సానుభూతి పెల్లుబుకటమే లక్ష్యమని చెబుతున్నారు. అయితే.. గులాబీ దళం అంచనాలకు భిన్నంగా.. ఎదురు ప్రశ్నలు తెర మీదకు వస్తూ.. అప్పుడు చేయని పనుల్ని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించటం వారికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు.