Begin typing your search above and press return to search.

ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన కేసీయార్ ఇపుడు జిల్లాల నుండి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   23 Aug 2023 4:39 AM GMT
ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారా ?
X

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన కేసీయార్ ఇపుడు జిల్లాల నుండి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారట. టికెట్లు దక్కని సీనియర్లు, ఆశావహుల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది ? పార్టీలో ఉండేదెవరు, బయటకు వెళ్ళిపోయేదెవరు అనే విషయాలపై ఆరాలు తీస్తున్నారు. అసమ్మతి నేతల మద్దతుదారులు పెట్టకుంటున్న సమావేశాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఖమ్మం, మల్కాజ్ గిరి, అసిఫాబాద్, ఉప్పల్ లాంటి అనేక నియోజకవర్గాల్లోని పార్టీ యంత్రాంగాలు ఇపుడిదే పనిలో పడ్డాయి.

పాలేరులో తనకు టికెట్ దక్కుతుందని తుమ్మల నాగేశ్వరరావు అనుకున్నారు. అయితే కేసీయార్ కందాళం ఉపేందర్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. దాంతో తుమ్మల మద్దతుదారులు, క్యాడర్ మండిపోతున్నారు. ఖమ్మంలోని ఒక ఫంక్షన్ హాలులో మంగళవారం పెద్ద మీటింగే పెట్టుకున్నారు. కేసీయార్ ను అమ్మనాబూతులు తిట్టడమే కాకుండా వెంటనే తుమ్మల కాంగ్రెస్ లో చేరాలని డిమాండ్లు చేశారు. ఇక కొత్తగూడెం విషయంలో కూడా ఇదే జరిగింది. జలగం వెంకటరావు తనకు టికెట్ ఆశించారు. అయితే వనమాకే టికెట్ దక్కింది.

మల్కాజ్ గిరిలో తనకు, మెదక్ లో తన కొడుక్కి టికెట్లు కావాలని మైనంపల్లి హన్నంతరావు చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే మైనంపల్లికి టికెట్ ఇచ్చిన కేసీయార్ కొడుక్కి టికెట్ ఇవ్వలేదు. దాంతో మైనంపల్లి కేసీయార్, హరీష్ తదితరులపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. మద్దతుదారులతో భారీ మీటింగ్ పెట్టారు.

ఖానాపూర్లో రేఖానాయక్ కు టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆమె పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. మరి రేఖ ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. ఉప్పల్ టికెట్ ను మాజీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆశించారు. అయితే కేసీయార్ టికెట్ ఇవ్వలేదు. దాంతో బొంతు తన మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుంటున్నారు.

పైన చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టికెట్లు దక్కని సీనియర్లు, ఆశావహులు చాలామంది తమ మద్దతుదారులతో మీటింగులు పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. రెండు మూడు రోజుల్లో భవిష్యత్తును ప్రకటించే అవకాశముంది.