Begin typing your search above and press return to search.

ఆనాడు కాంగ్రెసోడు ఒక్క‌డైనా నోరెత్తిండా: కేసీఆర్ ఫైర్‌

తాను ప‌డిన క‌ష్టం.. త‌న‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వేసిన జోకులు, అధికార పార్టీ కాంగ్రెస్ నిర్బంధాలు వంటి వాటిని త‌వ్వి తీశారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 6:14 PM GMT
ఆనాడు కాంగ్రెసోడు ఒక్క‌డైనా నోరెత్తిండా:  కేసీఆర్ ఫైర్‌
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. తాజాగా మేడ్చ‌ల్‌లో ప్ర‌జాశీర్వాద స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ ఉద్య‌మం ప్రాశ‌స్త్యం.. నాటి సంగ‌త‌లు.. తాను ప‌డిన క‌ష్టం.. త‌న‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వేసిన జోకులు, అధికార పార్టీ కాంగ్రెస్ నిర్బంధాలు వంటి వాటిని త‌వ్వి తీశారు. "ఆనాడు కాంగ్రెసోడు ఒక్క‌డైనా నోరెత్తిండా" అంటూ.. తెలంగాణ ఉద్య‌మ సంగ‌తుల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు.

"20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభించా. ఆరోజు న‌న్ను చూసి న‌వ్వెటోడే కానీ.. నాతో క‌లిసి వ‌చ్చినోడు లేడు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన‌మ‌ని చెబుతున్న కాంగ్రెసోళ్లు ఆనాడు ఏమైరి? ఒక్క‌డ‌న్నా నాతో క‌లిసి వ‌చ్చిండా? నాడు ప్రతీ ఒక్కరూ నవ్వులాటగా చూశారు. హేళ‌న చేశారు. తెలంగాణ అయ్యేదా.. వచ్చేదా.. అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇవాళ అదే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. ఇప్పుడొచ్చి మొస‌లి క‌న్నీళ్లు కారుస్తున్న‌రు. వారిని న‌మ్ముత‌మా? న‌మ్మి న‌ట్టేట మునుగుత‌మా?" అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకపోతే.. మనం పోరాటం చేసి ఉండకపోతే మేడ్చల్‌ జిల్లా వచ్చేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు దిక్కులేని స్థితిలో ఉన్నామ‌న్నారు. "నా మీద ఎన్నో నిందలు వేశారు.. అవమానించారు.. హేళనగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉద్యమంలో నాతో కలిసిరాకపోయినా.. చాలా అవహేళనగా మాట్లాడారు. వాటిని దాటుకొని పోరాటం చేశాం. దాని ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విష‌యం మేడ్చ‌ల్ ప్ర‌జ‌ల‌కు తెలుసు. వీరు విజ్ఞులు. ఆలోచించి ఓటేయండి. దిక్కుమాలిన పార్టీల‌ను న‌మ్మ‌కండి" అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

పాలమూరు వాసుల కోసం తాను జోలెప‌ట్టి అడిగినా.. నాటి కాంగ్రెస్ పాల‌కులు క‌నీసం రూపాయి కూడా విద‌ల్చ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఎక్కడో పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడికి వెళ్లి ఓదార్చాన‌ని తెలిపారు. కాంగ్రెస్ హ‌యాంలో ఎంత దుర్మార్గమైన పాలన కొనసాగిందో ఇంత‌క‌న్నా చెప్ప‌లేన‌ని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నార‌ని కేసీఆర్ చెప్పారు.

గ‌త 10 ఏళ్ల కాలంలో ప్రజా బలం, ఆశీర్వాదంతో తెలంగాణను అనేక రంగాల్లో నంబర్‌ 1గా నిలబెట్టుకున్నామ‌ని కేసీఆర్ చెప్పారు. మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింద‌న్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామ‌ని, ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే మ‌ళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పారు.