Begin typing your search above and press return to search.

అధికారం పోతే కానీ జనాల సమస్యలు గుర్తుకు రావా కేసీఆర్?

తాజాగా కేసీఆర్ కూడా ఇదే అంశంపై ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ప్లాన్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   30 March 2024 4:53 AM GMT
అధికారం పోతే కానీ జనాల సమస్యలు గుర్తుకు రావా కేసీఆర్?
X

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక్కరోజు సక్కంగా రివ్యూ చేయటం.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడ్రెస్ చేయటం.. సమాచారం ఇవ్వటం.. ప్రజలకు ఊరటను ఇవ్వటం లాంటి ఏ ఒక్క పనిని చేయని గులాబీ బాస్ కేసీఆర్.. విపక్ష నేతగా అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆసక్తి చూపని వేళ విమర్శలు ఉక్కిరిబిక్కి చేస్తుంటే.. తాజాగా ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు స్పందించటం ఆసక్తికరంగా మారింది.

పంటలు పలు జిల్లాల్లో ఎండుతున్నాయని.. రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం.. ప్రభుత్వ వైఫల్య ముద్రను వేసేందుకు వీలుగా గులాబీ బాస్ బయటకు రానున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. పంటలు ఎండిపోతున్నట్లుగా ఈ వారంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విమర్శలు చేయటం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో పర్యటించి.. ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు.

తాజాగా కేసీఆర్ కూడా ఇదే అంశంపై ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ప్లాన్ చేసుకున్నారు. ఎండుతున్న పంటల్ని పరిశీలించేందుకు వీలుగా ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు తగ్గట్లు షెడ్యూల్ సిద్ధమైంది. రాష్ట్రంలో సాగునీరు లేక.. భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించటం ద్వారా సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

జనగామ.. సూర్యాపేట.. నల్గొండ జిల్లాల్లో పర్యటించేందుకు వీలుగా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత భాగమైన జిల్లాల్ని ఎంపిక చేసుకున్న కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకుంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ కు పెద్దఎత్తున మద్దతు ఉంది. అలాంటి జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏమీ చేయట్లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది కేసీఆర్ ప్లానింగ్ గా చెబుతున్నారు.

కీలకమైన ఎంపీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. రేవంత్ సర్కారు సమర్థతపై సందేహాలు వ్యక్తమయ్యేలా టార్గెట్ చేయాలని చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్ తో పాటు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సైతం పంటలు ఎండిపోతున్న ప్రాంతాల్లో పర్యటించి.. దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు వివరించారు. రైతుల్ని కలిసి వారికి భరోసా కల్పించేందుకు వీలుగా ఒకరోజు పర్యటనను ఖరారు చేయటంలో కీలక భూమిక పోషించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పర్యటన ప్రకటనపై కేసీఆర్ కు నెగిటివ్ గా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రైతులు ఎదుర్కొంటున్న పలు అంశాలపై ఆందోళన జరిగితే.. ఒక్కరోజైనా వాటిపై మాట్లాడారా? వారికి అండగా నిలుస్తామని ప్రకటన చేశారా? అని ప్రశ్నిస్తూ.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు తన్నుకు వస్తోంది? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించటం గమనార్హం.