Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్‌.. ఇది త‌గునా?.. నెటిజ‌న్ల టాక్‌

సాధార‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా.. కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతోపాటు.. త‌న అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను కూడా ఖాళీ చేశారు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 6:45 AM GMT
కేసీఆర్ స‌ర్‌.. ఇది త‌గునా?.. నెటిజ‌న్ల టాక్‌
X

నెటిజ‌న్లు ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా నిముషాల్లోనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నేత‌ల వ్య‌వ‌హారంలో అయితే.. మ‌రింత దూకుడుగా ఉంటున్నారు. ప‌రిస్థితుల‌ను సంపూర్ణంగా గ్ర‌హించి.. స‌రైన విధంగా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు వ‌చ్చేశాయి. కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ప‌దేళ్ల‌పాటు అధికారం చ‌లాయించిన కేసీఆర్ దిగిపోయారు.

సాధార‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా.. కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతోపాటు.. త‌న అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను కూడా ఖాళీ చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని రాజ్‌భ‌వన్‌కు పంపించారు. అయితే, నిబంధ న‌ల మేర‌కు నేరుగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి.. అందించాల‌ని స‌మాచారం రావ‌డంతో విధిలేని ప‌రిస్థితిలో మొహం చూపించ‌డం ఇష్టం లేక‌పోయినా.. ఆయ‌నా రాజ్‌భ‌వ‌న్ ఇలా వెళ్లి అలా వ‌చ్చేశారు. మీడియాకు కూడా స‌మాచారం ఇవ్వ‌లేదు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. త‌న‌దే అధికారం.. త‌న‌ను గెలిపిస్తార‌ని.. మూడో సారి కూడా ముఖ్య‌మంత్రి పీఠం త‌న‌దేన‌ని భావించిన కేసీఆర్‌కు తెలంగాణ స‌మాజం నుంచి ఊహించ‌ని విధంగా ఎదురు గాలి వీచింది. కార‌ణాలు అంద‌రికీ తెలిసిన‌వే అయినా.. కేసీఆర్ మాత్రం గ్ర‌హించ‌లేక పోయారు. స‌రే.. ఇది ప‌క్క‌న పెడితే.. ప‌దేళ్ల‌పాటు అధికారం ఇచ్చిన తెలంగాణ స‌మాజం ప‌ట్ల చివ‌రి నిముషంలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది.

క‌నీసం.. మీడియా ముందుకు రాలేదు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌లేదు. అధికారం మొత్తం త‌న నుంచి ఎవ‌రో బ‌ల‌వంతంగా లాగేసుకున్నార‌నే ఫీలింగ్‌లో ఉన్నారో.. లేక తెలంగాణ స‌మాజం మొత్తం త‌న‌కే క‌ట్టుబ‌డి ఉండాల‌ని.. త‌న‌నే ఎన్నుకోవాల‌ని ఆశించారో తెలియ‌దు కానీ.. ప‌దేళ్ల‌పాటు త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు ఒక్క ధ‌న్య‌వాద తీర్మానం కూడా విడుద‌ల చేయ‌లేదు. తెలంగాణ స‌మాజానికి ఆయ‌న ఎలాంటి సందేశం కూడా ఇవ్వ‌లేదు.

ప‌దేళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌ను కూడా అభినందించ‌లేక పోయారు. నిజానికి ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాలు మార‌డం కేసీఆర్ కు తెలియంది కాదు. ఆయ‌నే అనేక సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని చెప్పుకొచ్చారు. కానీ.. తెలంగాణ విష‌యానికి వ‌చ్చేసరికి మాత్రం.. త‌నను తాను విస్మ‌రించి.. స‌మాజాన్ని క‌నీసం ప‌ల‌క‌రించుకుండానే.. వెళ్లిపోయారు. దీనినే నెటిజ‌న్లు కార్న‌ర్ చేస్తూ.. కేసీఆర్ స‌ర్‌.. ఇది త‌గునా! అని ప్ర‌శ్నిస్తున్నారు. భ‌విష్య‌త్ ప్ర‌జాస్వామ్యానికి, త‌రాల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నార‌ని అడుగుతున్నారు.