కేసీఆర్ రాలేదు.. విష్ చేయలేదు.. బాధ భరించలేకున్నారా? : నెటిజన్ల టాక్
అయితే.. ఈ కార్యక్రమానికి రావాలంటూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయంగా రేవంత్‌రెడ్డి ఆహ్వానం పంపిం చారు
By: Tupaki Desk | 8 Dec 2023 2:30 AMతెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకుడు.. రేవంత్‌రెడ్డిని విష్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ నాయకుడికి మనసు రాలేదా? కనీసం.. నోటి మాట కూడా ఆయన రేవంత్‌ను అభినందించలేకపోయారా? అంటే.. ఔననే అంటున్నారు నెటిజన్లు. తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భరీ ఎత్తున ప్రజలు వచ్చారు. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.
అయితే.. ఈ కార్యక్రమానికి రావాలంటూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయంగా రేవంత్‌రెడ్డి ఆహ్వానం పంపిం చారు. గతంలో ఈ సంప్రదాయం ఉంది. కొత్త సీఎం బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో అనేక మంది గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారు హాజరై అభినందించేవారు. అయితే.. రాను రాను రాజకీయాలు వ్యక్తిగత కక్షలకు.. వివాదాలకు కేంద్రంగా మారడంతో ఈ అనుబంధం సన్నగిల్లుతూ వస్తోంది. అయినా.. ఒకటి రెండు రాష్ట్రాల్లో సంప్రదాయం కొనసాగుతోంది.
తాజాగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారని అందరూ అనుకున్నారు. ఎందుకం టే.. ఆయన సీనియర్ నాయకుడు, ఎన్నో పోరాటాలు చేసిన నేత. మంచి-చెడుల సమ్మేళనాన్ని ఆయన అనుభవించారు. పదవే ప్రధానం చేసుకున్న నాయకుడు కూడా కాదు. దీంతో ఆయన వస్తారని భావించారు. కానీ, కేసీఆర్ కు మాత్రం మనసు రాలేదు. ఆయన హాజరు కాలేదు. పోనీ.. ఎక్స్ వేదికగా అయినా.. ఆయన స్పందించలేదు.
పోనీ. ఆయన కుమారుడు అయినా.. స్పందించారా? అంటే అది కూడా లేదు. కేవలం హరీష్ రావు మాత్రం మొక్కుబడిగా ఓ మాట ఎక్స్‌లో రాసేసి అభినందనలు తెలిపారు. ఈ పరిణామాలను గ్రహించిన నెటిజన్లు.. కేసీఆర్ బాధ భరించలేకున్నారా? ఇంకా.. సీఎం సీటు తనదేనని. తనకే దక్కాలని భావిస్తున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.