Begin typing your search above and press return to search.

కేసీయార్ ని ఓటమి బాట పట్టించిన ఎనిమిది కారణాలు...!

కేసీయార్ కి నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఓటమిని మళ్లీ చవి చూపించాయి2023 తెలంగాణా సార్వత్రిక ఎన్నికలు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 7:32 AM GMT
కేసీయార్ ని ఓటమి బాట పట్టించిన ఎనిమిది కారణాలు...!
X

కేసీయార్ కి నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఓటమిని మళ్లీ చవి చూపించాయి2023 తెలంగాణా సార్వత్రిక ఎన్నికలు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన కేసీయార్ మళ్లీ ఓటమి అన్న మాట వినలేదు. నలభయ్యేళ్ళ తరువాత కామారెడ్డిలో ఆయన స్వయంగా ఓడిపోయారు. అలాగే ఆయన పార్టీ కూడా పరాజయం పాలు అయింది. దానికి కారణాలు ఏంటి అని అన్వేషిస్తే చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి తీసుకుంటే మాత్రం ఒక ఎనిమిదింటిని కచ్చితంగా చెప్పుకోవాలి.

1. అందులో మొదటిది ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉండడం. ప్రజలు బీయారెస్ పాలన పట్ల విసిగి ఉన్నారు అన్నది అనేక ఉప ఎన్నికల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా చాటి చెప్పాయి. అయినా సరే బీయారెస్ నాయకత్వం మేలుకోలేకపోయింది. అంతే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఒక స్థాయిలో ఉంది. కానీ వారికే కేసీయార్ టికెట్లు ఇవ్వడం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావాల్సి వచ్చింది. ఇక గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తీసుకుంటే పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్యన దూరం పెరిగింది. అలాగే పార్టీకి క్యాడర్ మధ్య దూరం పెరిగింది. అలాగే పార్టీలో ఏ స్థాయిలోనూ క్యాడర్ కి లీడర్ కి మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం కూడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది అని అంటున్నారు.

2. ఇక రెండవది తీసుకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీయారెస్ నేతల ఆస్తులు భారీగా పెరగడం. అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తమ జీవితాలు బాగుపడకపోగా గ్రామ నేత నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా వారి ఆస్తులు బాగా పెరిగాయన్నది జనాలలో ఉన్న ఒక అభిప్రాయంగా మారింది. నామినేషన్ వేసేటపుడు చూపించిన ఆస్తులు తరువాత కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయన్నది జనాలు గ్రహించారు. అదే సమయంలో తమ వ్యక్తిగత ఆస్తులు మాత్రం పెరగలేదని భావించారు.

3. పాలనాపరమైన విషయాల్లో విధాన నిర్ణయాలలో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఏ అధికార పదవి అయినా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పధకం అయినా అభివృద్ధి అయినా ఎమ్మెల్యేలే కీలక పాత్రగా మారారు. వారి మాటే శాసనంగా మారింది. ఒక విధంగా నియోజకవర్గాలలో సామంతరాజులుగా వెలిగారు. ఇదే ప్రజలకు అసలు నచ్చలేదు. దాంతోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు.

4. పదేళ్ళ పాలన అంటే మామూలు విషయం కాదు. అలా రెండు సార్లు గెలిచి పాలించిన బీయారెస్ కి కూడా యాంటీ ఇంకెంబెన్సీ బాగా పెరిగింది. సాధారణంగా ప్రజలు మార్పు కోసం చూస్తారు. ప్రభుత్వాన్ని మార్చేయాలని అనుకుంటారు. దీన్ని బాగా పసిగట్టి అవకాశాన్ని అందిపుచ్చుకుంది కాంగ్రెస్. ప్రజలలో వస్తున్న ఆ ఆలోచనను మార్పుని తమ రాజకీయ సొమ్ముగా చేసుకుంది.అందుకే బీయారెస్ ఓడింది అన్నది ఒక కారణం.

5. ప్రజల ఆకాంక్షలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వారి ఆశలకు ప్రభుత్వ ఆలోచనలకు మధ్య అతి పెద్ద గ్యాప్ అయితే ఏర్పడింది. అందుకే కూడా బీయారెస్ ఓటమి చెందింది అని భావిస్తున్నారు. బీయారెస్ హయాంలో అభివృద్ధి జరిగింది. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. దాన్ని గమనించడంలో కూడా జరిగిన పొరపాట్లు కూడా బీయారెస్ ని గద్దె దించాయి.

6. ఇక బీయారెస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏకంగా 45 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలలో ఉంది దాని కంటే ముందు పార్టీ వాదులలో ఉంది. అయినా సరే తిరిగి వారినే అభ్యర్ధులుగా ప్రకటించడం ద్వారా కోరి ఓటమిని బీయారెస్ తెచ్చుకుంది అని అంటున్నారు. వారికి టికెట్లు ఇవ్వకుండా కొత్త ముఖాలకు ఇచ్చి ఉంటే కచ్చితంగా ఆయా సీట్లలో బీయారెస్ గెలిచి ఉండేది అన్నది కూడా అంటారు. అయితే రెబెల్స్ గా వారు మారి తిరుగుబాటు చేస్తారు అని భావించి హై కమాండ్ ముందు జాగ్రత్త పడినట్లుగా ఉంది. కానీ అదే చివరికి బెడిసికొట్టింది అని అంటున్నారు

7. తెలంగాణా సమాజానికి ఆత్మ గౌరవం చాలా మెండు. అయితే ఆ సెంటిమెంట్ తోనే తమ రాజకీయ పంట పండిచుకుంటూ వచ్చిన బీయారెస్ మూడవసారి గెలవడం కోసం మాత్రం ఎన్నో వ్యూహాలు చేసింది. ఒక దశలో ఆత్మవిశ్వాసం కనబరచింది. అది అతిగా మారింది. అంతే కాదు విపక్షాలను సైతం లైట్ గా తీసుకోవడమే కాదు అహంకారపూర్తిగమైన వ్యాఖ్యలు బీయారెస్ అగ్ర నేతల నుంచి వచ్చాయని జనాలు భావించారు. కేసీయార్ కేటీయార్, కవితలు చేసిన కొన్ని కామెంట్స్ కూడా జనాలు జాగ్రత్తగా గమనించారు. అందుకే వాటికి బ్రేక్ వేసేలా ఓటు ఆయుధంతో ఇలా తీర్పు ఇచ్చారు అన్నది కూడా ఉంది.

8. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని ఐక్యతను ప్రదర్శించడం, దాని వ్యూహాలు కూడా చక్కగా పనిచేయడం కూడా బీయారెస్ ఓటమిని కారణాలు. బీజేపీ అనుకున్న తీరులో తన రాజకీయ ప్రదర్శన చేయకపోవడంతో ఆ ప్లేస్ లోకి చాలా ఈజీగా కాంగ్రెస్ ప్రవేశించగలిగింది. అప్పటికే నిండుగా పోగు చేయబడి ఉన్న యాంటీ ఇంకెంబెన్సీని తన వైపు తిప్ప్పుకుని బీయారెస్ ని ఓడించే బలమైన శక్తిని తామే అని నిరూపించగలిగింది. మొత్తానికి కర్ణుడి చావుకు ఆరు కారణాలు చెబుతారు. కేసీయార్ ఓటమికి ఎనిమిది కారణాలు కనిపిస్తున్నాయి.