Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓడిపోవడానికి ఒక్కటే కారణం...!

తెలంగాణాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అన్నది ఇపుడు బీఆర్ ఎస్ వర్గాలలో అంతర్మధనం చెలరేగేలా చేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:21 AM GMT
కేసీఆర్ ఓడిపోవడానికి ఒక్కటే కారణం...!
X

తెలంగాణాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అన్నది ఇపుడు బీఆర్ ఎస్ వర్గాలలో అంతర్మధనం చెలరేగేలా చేస్తోంది. నిజానికి 2014 నుంచి 2023 దాకా చూసుకుంటే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. అలా ఇలా కాదు పెద్ద ఎత్తున జరిగింది. అవన్నీ వరసబెట్టి చెపుకుంటే పెద్ద లిస్ట్ ఉంది.

ముఖ్యంగా చూడాలీ అంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాకు ఆస్తులను బాగా పెంచింది. అనేక సాగునీటి ప్రాజెక్టులను కట్టింది. ఐటీ ఎగుమతులు బాగా పెరిగాయి. రోడ్లు చూస్తే చక్కగా ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం అయితే దూసుకుపోయింది. ఆ రంగంలో ఉన్న వారు పండుగే చేసుకుంటున్నారు. వెనకబడిన ప్రాంతాలకు నీటి సదుపాయం సమకూరింది.

తెలంగాణాలోని చాలా జిల్లాలు వలసలకు పెట్టింది పేరు అంటే అవి కూడా బాగా తగ్గాయి. అభివృద్ధి ఒక స్థాయిలో జరిగింది అని అంతా అంటారు. ఇలా ఎన్నో రకాలుగా ప్రగతి దారులు తెరచిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అన్నది బీఆర్ఎస్ శ్రేణులకే అంతు చిక్కనిదైంది. ఇక అసలు విషయానికి వస్తే కేసీఆర్ ఓడిపోవడానికి ఒక్కటే కారణంగా అంతా చెబుతున్నారు.

అదే ఆయన ముద్దుల తనయ కవిత విషయం అని అంటున్నారు. ఆమె మీద వచ్చిన లిక్కర్ కేసు. ఇందులో ఆమె కొంతమేర ఇరుక్కున్న తరువాత బీజేపీ వారికి కొన్ని ఆధారాలు లభించాయి అని చెబుతారు. ఈ పరిణామం జరిగిన తరువాతనే బీజేపీ మీద కేసీఆర్ తన దూకుడు తగ్గించారు అని అంటారు. బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ ని మార్చిన తరువాత జనాలకు కూడా చాలా విషయాలు అర్ధం అయ్యాయని అంటారు.

అవేంటి అంటే బీజేపీ వారితో కేసీఆర్ పబ్లిక్ గా కుమ్మక్కు అయ్యారని అందరికీ తెలిసింది అని అంటారు. ఇది కాస్తా అలా పాకేసి గ్రామీణ ప్రాంతాలకు చేరిపోయింది. అంతే ఒక్కసారిగా మార్పు వచ్చేసింది అని అంటారు. ఇక అదే టైం లో వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మార్పు రావాలి అని స్లోగన్ ఇచ్చారు. అది జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది.

ఆ మార్పు అన్న మాటకే జనాలు ఆకర్షితులు అయ్యారు. అలా రోజు రోజుకీ బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతూ ఎన్నికల వేళకు పూర్తిగా పరాజయం బాట పట్టింది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మార్పు రావాలి స్లోగన్ కాస్తా కాంగ్రెస్ కి వజ్రాయుధం అయింది. అంతే కాదు జనాలు దాన్ని అందిపుచ్చుకుని ఆ మార్పు అంతా కేసీఆర్ ని గద్దె దించడమే అని ఫిక్స్ అయిపోయారు.

అలా చివరికి కేసీఆర్ పదవికే ముప్పు వచ్చింది. దీనిని బట్టి ఆలోచిస్తే ఎక్కడి విషయం ఎక్కడికి చుట్టుకుంది అని అనిపించక మానదు. కవిత మీద వచ్చిన లిక్కర్ స్కాం విషయంలో డేరింగ్ గా ఎదుర్కొని ఉంటే ఆమె అరెస్ట్ అయినా బీజేపీ చేయించింది అన్నది ఎన్నికల వేళ సెంటిమెంట్ గా బీఆర్ఎస్ కి వచ్చేది అది ఎన్నికల్లో కేసీఆర్ కి ఒక దూకుడుగా మారేది. అలా మరోసారి అధికారం చేతిలో పడేది.

మరి ఆయనకు ఈ తడవ తెలంగాణా సెంటిమెంత్ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అదే టైం లో కూతురు సెంటిమెంట్ తో మొత్తం సీన్ ఉల్టా పల్టా అయింది అని అంటున్నారు. ఏది ఏమైనా కొన్ని సంఘటనలు చిన్నవిగా కనిపిస్తాయి. జనాలు వాటిని లైట్ తీసుకుంటారు అని భావిస్తారు. కానీ అవే కొంప ముంచుతాయి. కేసీఆర్ విషయంలో చివరికి అదే జరిగింది అని ఇపుడు అంతా ఒక అంచనాకు వస్తున్నారు.

మొత్తానికి ఎక్కడికి లిక్కర్ స్కాం మరెక్కడ చెక్కు చెదరని కేసీఆర్ ఇమేజ్ అలా వచ్చి ఇలా దాన్ని డ్యామేజ్ చేసింది. తీరా చూస్తే కేసీఆర్ కి దాంట్లో నేరుగా ఏమీ సంబంధం లేదు అన్నది అంటారు. కానీ ఎక్కడ కుమార్తె అరెస్ట్ అవుతుందో అన్న దాంతోనే ఆయన నెమ్మదించారు, తమ వ్యూహాలను మార్చి బీజేపీతో సర్దుకున్నారని ప్రచారం సాగింది. ఏది ఏమైతేనేమి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇపుడు చేతులు కాలాయి. ఆకులు పట్టుకున్నా నో యూజ్ అని అంటున్నారు.