Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కేసీఆర్ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ!

ఈ క్రమంలో... మొన్నటి వరకు కేసీఆర్ మీద పోటీగా 100 నామినేషన్లు వేస్తామంటూ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:01 AM GMT
కామారెడ్డిలో కేసీఆర్  పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆల్ మోస్ట్ అభ్యర్థులను ప్రకటించేసిన పార్టీలు.. ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ ను ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వకూడదని అటు బీఆరెస్స్, ఇటు కాంగ్రెస్ లు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటు ఈటల రాజేందర్, ఇటు రేవంత్ లు నేరుగా తలపడటానికి రెడీ అయిపోయారు. ఈ సమయంలో కేసీఆర్ పై పోటీకి పౌల్ట్రీ రైతులు రంగంలోకి దిగుతున్నారు!

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎప్పటికప్పుడు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్.. గజ్వేల్‌ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు గ్యారెంటీ అని ధీమాగా చెబుతున్నారు బీఆరెస్స్ నేతలు. ఇందులో భాగంగా... కామారెడ్డిలో కూడా మంచి ఆధిక్యంతో గెలిచి.. ప్రతిపక్షాలకు తమ సత్తా చాటాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో కేసీఆర్ కు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో... మొన్నటి వరకు కేసీఆర్ మీద పోటీగా 100 నామినేషన్లు వేస్తామంటూ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో నాడు హుటాహుటిన రంగంలోకి దిగిన కేటీఆర్ ఆ రైతులందరినీ పిలుచుకుని సర్ధిచెప్పారు. ఈ సమయంలో మాస్టర్ ప్లాన్‌ ను తక్షణమే రద్దు చేస్తున్నామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఆ రైతులు శాంతించారు. దీంతో.. కేసీఆర్ విజయానికి ఇక ఎలాంటి అడ్డంకి లేదని ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్‌ కు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పౌల్ట్రీ రైతులు. ఇందులో భాగంగా... కామారెడ్డిలో కేసీఆర్‌ కు పోటీగా 100 నామినేషన్లు వేస్తామని వెల్లడించారు. తమ డిమాండ్ల సాధన కోసమే నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులు స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్స్ వేస్తామని ప్రకటించారు. కార్పొరేట్ శక్తుల నుంచి తమకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. మరి ఈ విషయంపై కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

కాగా... ఈదఫా గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్... కామారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను కేటీఆర్‌ ‌ కు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో... ఆ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే రంగంలోకి దిగుతున్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ రైతుల సమస్యను కూడా పరిష్కరించగా... ఇప్పుడు తాజాగా పౌల్ట్రీ రైతుల నిరసన నామినేషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో... ఈ సమస్యకు పరిషికారం ఏమిటనేది ఆసక్తిగా మారింది.

ఇలా రైతులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనగా భారీగా నామినేషన్లు వేయాలనుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. బీఆరెస్స్ ప్రభుత్వం మీద నిరసనతో కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ పసుపు రైతులు.. ఏకంగా 1000 నామినేషన్లు వేశారు. ఆ ప్రభావంతోనే ఆమె ఓటమి పాలయ్యారని చెబుతారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు పౌల్ట్రీ రైతులు!