Begin typing your search above and press return to search.

కేసీఆర్ ధీమా ఏంటి? ‘12’ కంటే తక్కువ చెబితే నో ఎంట్రీ?

గులాబీ బాస్ కేసీఆర్ రూటు సపరేటు. ప్రజా జీవితంలో ఉన్న వారు నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు.

By:  Tupaki Desk   |   18 May 2024 4:41 AM GMT
కేసీఆర్ ధీమా ఏంటి? ‘12’ కంటే తక్కువ చెబితే నో ఎంట్రీ?
X

గులాబీ బాస్ కేసీఆర్ రూటు సపరేటు. ప్రజా జీవితంలో ఉన్న వారు నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడో కానీ ప్రజలను కలవరు. అదే విషయాన్ని ప్రశ్నిస్తే.. ఆయన వినిపించే వాదన వేరుగా ఉంటుంది. ప్రజలను కలిస్తేనే ముఖ్యమంత్రి అవుతారా? సీఎం అంటే.. సమస్యల మీద సమాలోచనలు చేయాలే తప్పించి.. చిన్నస్థాయి సమస్యల్ని పరిష్కరించటానికి అధికారులు ఉన్నారుగా? అలాంటప్పుడు వారు చేయాల్సిన పనులు ముఖ్యమంత్రి ఎందుకు చేయాలంటారా? ఇక్కడ వారు మిస్ అయ్యే లాజిక్ ఏమంటే.. సమస్యల్ని అధికారులు పరిష్కరించటం లేదు కాబట్టే ముఖ్యమంత్రి వద్దకు వస్తుంటారే తప్పించి.. వారు సమస్యల్ని సాల్వ్ చేస్తే రావాల్సిన అవసరం ఉండదు కదా? అన్నది మిస్ అవుతుంటారు.

అధికారంలో ఉండి అంతులేని అహంకారాన్ని ప్రదర్శించినందుకే కేసీఆర్ చేతి నుంచి అధికారం చేజారిందన్న విశ్లేషణను గులాబీ నేతలు సైతం ఒప్పుకోవటం తెలిసిందే. అందుకే అంటారు.. కేసీఆర్ ను డీల్ చేయటం చాలా కష్టమని. చాలామంది ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు ఆయన గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తూ ఉంటారు. తనకు నచ్చినప్పుడు మాత్రమే కలిసేందుకు ఇష్టపడటం.. ఎంత ముఖ్యమైన ఫైల్ ఉన్నా.. మరెంత ముఖ్యమైన అంశం మీద ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉన్నా.. కేసీఆర్ ఓకే చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి నాలుగైదు నెలల వరకు ఎదురు చూడాల్సి వచ్చేదని చెబుతారు.

ఇలాంటి తీరు దేశంలోని మరే ముఖ్యమంత్రి చేయలేదనే మాట తరచూ వినిపిస్తూ ఉండేది. తాను చెప్పిందే వేదమన్నట్లుగా కేసీఆర్ తీరుకు చాలామంది ఇబ్బంది పడేవారు. కానీ.. ఆయన చేతిలో అధికారం ఉండేది కాబట్టి.. ఎదురు మాట్లాడేవారు కాదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్ష నేతగా ఉన్నప్పుడు అదే తీరును ప్రదర్శిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం పాటు ప్రజలకు దూరంగా ఉన్న ఆయన.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రతో బయటకు రావటం తెలిసిందే.

తాను ఏర్పాటు చేసిన సభలకు వేలాదిగా ప్రజలు రావటంతో ఎన్నికల్లో గెలుపు మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని దగ్గర నుంచి గమనిస్తున్నవారంతా.. బీఆర్ఎస్ కు ఒకట్రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చే ఛాన్సు లేదని తేల్చేస్తున్నారు. కానీ.. కేసీఆర్ ఈ వాదనను కొట్టిపారేస్తున్నారట. తనను కలిసిన వారందరికి పన్నెండు సీట్ల కంటే తక్కువ వచ్చే వీల్లేదని బల్లగుద్ది వాదిస్తున్నారట. ఒకవేళ.. ఎవరైనా వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నట్లుగా సమాచారం.

దీంతో.. కేసీఆర్ చెప్పే మాటల్ని వినటమే తప్పించి.. వాస్తవం ఏమిటో చెప్పే సాహసం చేయలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇలా అయితే ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పుడూ తాను అనుకున్నదే నిజమని.. మిగిలినదంతా అసత్యమని చెప్పే తీరుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ లెక్కన పన్నెండు ఎంపీ స్థానాల్ని గెలుచుకునే వీలుంది? అన్న ప్రశ్నను సంధించే ధైర్యం చేయట్లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే పన్నెండు స్థానాల్ని గెలుచుకోలేదని.. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. పన్నెండుకు ఎందుకు ఫిక్స్ అయ్యారో కానీ.. తమ ప్రాణాల మీదకు వచ్చిందని వాపోతున్నారు ఆయన సన్నిహితులు.