Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌రే.. బీఆర్ ఎస్ ప‌రిస్థితేంటి? కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?

ఈ రోజు ఒకరేలే అని అనుకుంటే.. తెల్లారి ఇద్ద‌రు.. మ‌రుస‌టి రోజు ముగ్గ‌రు అన్న‌ట్టుగా బీఆర్ ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోంది.

By:  Tupaki Desk   |   17 March 2024 3:49 AM GMT
కేసీఆర్ స‌రే.. బీఆర్ ఎస్ ప‌రిస్థితేంటి?  కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?
X

తెలంగాణ‌ను ప‌ది సంవ‌త్స‌రాలు అప్ర‌తిహ‌తంగా పాలించిన బీఆర్ ఎస్ పార్టీ ప‌రిస్థితి ఏంటి? నానాటికీ దిగ‌జారుతున్న పార్టీని గాడిలో పెట్ట‌డం సాధ్య‌మేనా? ఒక‌వైపు అనారోగ్యంతో అధినేత కేసీఆర్ ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న కుమార్తె కేసులో చిక్కుకుని జైలు పాల‌య్యారు. ఈ ప‌రిణామాల‌కు తోడు కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఒక్క‌రే క‌దా అనుకుంటే.. రోజుకు రోజుకు జారుకునే వారు పెరుగుతున్నారు. ఈ రోజు ఒకరేలే అని అనుకుంటే.. తెల్లారి ఇద్ద‌రు.. మ‌రుస‌టి రోజు ముగ్గ‌రు అన్న‌ట్టుగా బీఆర్ ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. దిగ్గజ నాయ‌కులు, నియోజ‌క‌వ‌ర్గాల‌ను శాసించ‌గ‌ల నాయ‌కులు కూడా కారు దిగిపోతున్నారు.

దీంతో బీఆర్ ఎస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్‌కు షాకిచ్చారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పసునూరి దయాకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.

మ‌రోవైపు ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అరగంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆయ‌న కూడా పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యారు. స‌హ‌జంగా పార్టీ మారేవారు అంటే.. అసంతృప్తులు అయి ఉండాలి. లేదా ఎన్నిక‌ల్లో టికెట్లు రాని వారైనా అయి ఉండాలి. కానీ, గెలిచిన నాయ‌కులు.. టికెట్లు ఇస్తామ‌న్న నాయ‌కులు కూడా కారు దిగిపోతున్న ప‌రిస్థితి పార్టీని ఘోరంగా దెబ్బ‌తీసేలా ఉంది. ఒక‌ప్పుడు దేశంలో చక్రం తిప్పుతాన‌ని బ‌య‌లు దేరిన కేసీఆర్‌.. అనివార్య వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దాని నుంచి విర‌మించుకున్నారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌..అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న క్షేత్ర‌స్థాయి నాయ‌కులు చెప్పిన మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. ఒంటెత్తు పోక‌డ‌లు పోయార‌నే వాద‌న కూడా ఉంది. ఈ ప‌రిణామాల‌తో అప్ప‌ట్లోనే కీల‌క నేత‌లు జారుకున్నారు. ఫ‌లితంగా 34 స్థానాల‌కే బీఆర్ ఎస్ ప‌రిమితం కాగా, ఇప్పుడు వీరిలోనూ ప‌ది మంది వ‌ర‌కు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే చాలా మంది వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌తో పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒక‌వైపు అనారోగ్యం, మ‌రో వైపు కుమార్తె కేసు.. ఇంకో వైపు జంపింగులు.. మాట విన‌ని కేడ‌ర్ ఇలా.. పార్టీ స్థాపించిన త‌ర్వాత‌.. ఎదురుకాని అనేక స‌మ‌స్య‌లు ఒక్క‌సారిగా బీఆర్ ఎస్‌ను చుట్టుముట్టాయి. మ‌రి దీని నుంచి కేసీఆర్ బ‌య‌ట ప‌డ‌తారా? లేక .. చేతులు ఎత్తేస్తారా? అనేది చూడాలి.