Begin typing your search above and press return to search.

10కి 6..మహా అయితే 8.. ఖమ్మంపై కేసీఆర్ లెక్క!?

భిన్నమైన భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగలేదు

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:30 PM GMT
10కి 6..మహా అయితే 8.. ఖమ్మంపై కేసీఆర్ లెక్క!?
X

''ఖమ్మం అసలు తెలంగాణలో ఉందా..'' ఓ పన్నెండేళ్ల కిందట బీ(టీ)ఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ వ్యాఖ్య ఇది. భిన్నమైన భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగలేదు. దీనికి కొంత నాయకత్వం లోపం కూడా కారణమే. అయితే, కేసీఆర్ ఆమరణ దీక్ష విరమణకు కేంద్రమైన ఖమ్మంలో మలి దశ ఉద్యమం పెద్దఎత్తునే సాగింది. అలాంటి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు రాలేదు. రెండుసార్లూ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018తో అయితే తెలంగాణ అంతటా బీఆర్ఎస్ హవా వీయగా.. ఖమ్మంలో మాత్రం ఏకంగా 9 స్థానాలు మహా కూటమి (కాంగ్రెస్-టీడీపీ-వామపక్షాలు)కి దక్కాయి.

ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ నెగ్గింది. ఇది రాజకీయంగా చాలా ప్రభావం చూపింది. ఆ తర్వాత 6 నెలల్లోపే జరిగిన ఎంపీ ఎన్నికల్లో సిటింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ అధికారంలో ఉన్నా ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. 2018లో ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవిని దక్కించుకుని జిల్లాలో కీలక నేతగా ఎదిగారు.

లెక్క ఎందుకు తగ్గిందబ్బా..?

ఉమ్మడి ఖమ్మం నేతలతో సీఎం కేసీఆర్ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో 10కి కనీసం 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని మరింత కష్టపడితే 8 స్థానాలనూ నెగ్గొచ్చని పేర్కొన్నారు. అంటే కనీసం నాలుగు.. గరిష్ఠంగా 2 స్థానాలపై ఆయన గెలుపు ఆశలు వదిలేశారా? అనే భావన వస్తోంది. ఖమ్మం లెక్కలో లేకుండా 109 స్థానాలకు గాను రాష్ట్రంలో 80 సీట్లలో బీఆర్ఎస్ గెలిచి అధికారం చేపడుతుందని కూడా వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే.. బీఆర్ఎస్ కు ఖమ్మంపై ఆశలు తక్కువగా ఉన్నట్లున్నాయి.

వాస్తవానికి ఖమ్మంలో వామపక్షాల ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్ కూడా సంప్రదాయ ఓట్లతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యధిక సీట్ల సాధనకు అధికార పార్టీ మరింత పోరాటం చేయాల్సి వస్తోంది. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఉన్న వామపక్షాలు ఈసారి బీఆర్ఎస్ తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరి వారికి కేటాయించే సీట్లు పోగా 6 స్థానాల్లో గెలవాలని కేసీఆర్ నిర్దేశించారా? అనేది తెలియాల్సి ఉంది.

సీట్ల కోసం వామపక్షాల పట్టు

ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్, వామపక్షాలకు పట్టుంది. గత ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీతో కలిసి ఆ పార్టీలు పోటీ చేశాయి. ఈసారి అనూహ్యంగా బీఆర్ఎస్ కు దగ్గరయ్యాయి. ఇటు చూస్తే.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. ఖమ్మం, కొత్తగూడెం స్థానాలను ఆశిస్తున్నారు. ఈ రెండూ బీఆర్ఎస్ సిటింగ్ సీట్లే. తీవ్ర స్థాయి ఆరోపణలుంటే తప్ప సిటింగ్ లకు సీటు నిరాకరించేది లేదని చెబుతున్న కేసీఆర్.. మరి వామపక్షాల డిమాండ్లను ఎంత వరకు తీరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సీపీఎం సంగతి అలా ఉంచితే.. మునుగోడులో బాగా ఉపయోగపడిన సీపీఐకు ఒక ఎమ్మెల్సీ స్థానమైనా ఇచ్చి చల్లబరుస్తారని గతంలో కథనాలు వచ్చాయి. పొత్తుపై త్వరగా తేల్చాలని.. న్యాయం చేయకుంటే.. తమ దారి తమదేనని ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్ కు అల్టిమేటం ఇచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిన 10కి 6 లేదా.. 10కి 8 వ్యాఖ్యలు వామపక్షాలతో పొత్తును కలుపుకొనా? కలుపుకోకుండానా? అన్నది తేలాల్సి ఉంది.