Begin typing your search above and press return to search.

ఏపీలో ‘పవర్’ ఎవరిది..? కేసీఆర్, కేటీఆర్ లెక్క వేర్వేరు

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశం అవుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వే అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   26 April 2024 11:08 AM GMT
ఏపీలో ‘పవర్’ ఎవరిది..? కేసీఆర్, కేటీఆర్ లెక్క వేర్వేరు
X

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశం అవుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ వే అనడంలో సందేహం లేదు. సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని అధికార వైసీపీని.., ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ, పవన్ కల్యాణ్ జనసేన, జాతీయ పార్టీ బీజేపీ కూటమి కట్టి సవాల్ చేస్తున్నాయి. జగన్ ఐదేళ్ల పాలనను సంక్షేమ రాజ్యంగా చూపుతూ జనంలోకి వెళ్తుండగా, ఆయన సాగించిన విధ్వంసం, అరాచకం ఇదీ అంటూ టీడీపీ కూటమి ధ్వజమెత్తుతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలే హైలైట్ అవుతున్నాయి. అయితే, పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది. బీఆర్ఎస్ ను ప్రతిపక్షానికి పరిమితం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. ఏపీలో ఆ పార్టీకి కొంత ఊపు తెచ్చింది.

ఒకప్పటి సహచరులు..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది ముమ్మాటికీ నిజం. కాగా, మొన్నటివరకు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గతంలో టీడీపీ నుంచి వచ్చినవారనే సంగతి తెలిసిందే. 2001లో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ విధానాలతో విభేదించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 2009లో టీడీపీ, వామపక్షాలతోనూ టీఆర్ఎస్ అధినేత పొత్తు పెట్టుకున్నారు. 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయాక తెలంగాణకు కేసీఆర్, ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే, 2018 నాటికి వచ్చేసరికి టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ను ఢీకొట్టాయి. దీంతో కేసీఆర్ కు చంద్రబాబుతో పూర్తిగా చెడింది. ఆ కసితోనే 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారని చెబుతారు. అప్పటి ఎన్నికలకు ముందు ఏపీలో గెలిచేది వైఎస్ జగన్ అని కేసీఆర్ ఓ బహిరంగ సభలోనూ చెప్పారు.

ఇప్పటికి ఇలా..

ఏపీ మరోసారి కీలక ఎన్నికలను ఎదుర్కొనబోతున్న వేళ కేసీఆర్ తాజాగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో మరోసారి జగన్ గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఇది తనకు అందిన సమాచారం ప్రకారం చెబుతున్న విషయంగా పేర్కొన్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్.. చెప్పిన అభిప్రాయాన్ని కొంతైన పరిశీలించాల్సి ఉంటుంది.

కేటీఆర్ మాట మాత్రం వేరు..

ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదినే దానిపై కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. ఓ చానల్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఏపీలోని రాజకీయ నాయకులు అందరూ తనకు మిత్రులేనంటూ తెలివిగా సమాధానాన్ని దాటవేశారు. జగన్, పవన్ తనకు అన్నయ్యలని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంచి మిత్రుడని, చంద్రబాబు అంటే గౌరవమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తండ్రి కేసీఆర్ చెప్పిన సమాధానానికి భిన్నంగా కేటీఆర్ మాట్లాడడం గమనార్హం.

కొసమెరుపు: కేసీఆర్, కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ముంగిట ఒకే చానల్ కు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకే యాంకర్ అడిగిన ఒకే ప్రశ్నకు వేర్వేరుగా సమాధానం చెప్పారు.