Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ తోలు తీస్తానన్న తర్వాతి రోజు కేసీఆర్ ఎక్కడ?

గతంలో మాదిరి కాదు. ఇప్పుడు సమాచారాన్ని అందించే బాధ్యత ఒక్క మీడియా మాత్రమే కాదు. అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ ఉత్సాహంతో సోషల్ మీడియా దూసుకెళుతోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2025 7:00 PM IST
సీఎం రేవంత్ తోలు తీస్తానన్న తర్వాతి రోజు కేసీఆర్ ఎక్కడ?
X

గతంలో మాదిరి కాదు. ఇప్పుడు సమాచారాన్ని అందించే బాధ్యత ఒక్క మీడియా మాత్రమే కాదు. అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ ఉత్సాహంతో సోషల్ మీడియా దూసుకెళుతోంది. అయితే.. ఇందులో నిజమెంత? అబద్దమెంత? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి మినహాయించి.. స్వేచ్ఛకు ఎల్లలు లేవు. కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహంతో వ్యవహరించే సోషల్ మీడియాతో తప్పుడు అంశాలకు ప్రచారం లభిస్తుంటాయి.తాజాగా చెప్పే ఉదంతానికి సంబంధించి మాత్రం.. మీడియా సైతం రిపోర్టు చేయటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్.. ఆదివారం హైదరాబాద్ లో పార్టీ నేతలతో రివ్యూ నిర్వహించటం.. అనంతరం మీడియాతో మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా రెండేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగినంత సమయాన్ని ఇచ్చానని.. ఇకపై తాను మౌనంగా ఉండనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా తాను మౌనం పాటించి.. చూస్తున్నప్పటికి పరిస్థితుల్లో మార్పు లేదన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు బయలుదేరినట్లుగా చెప్పిన కేసీఆర్.. ‘‘ఇయ్యాలటి నుంచి వేరు కథ. రేపటి నుంచి మరో కథ. తోలు తీస్తా’’ అంటూ రేవంత్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ తీవ్ర హెచ్చరిక అనంతరం తన భవిష్యత్ ప్లాన్ మీద ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని.. బ్రహ్మండమైన కరపత్రాన్ని కూడా తయారు చేస్తున్నామని.. నిత్యం ప్రజల్లో ఉంటానన్నట్లుగా కేసీఆర్ మాటలు సాగాయి. ఇంతలా మాట్లాడిన పెద్ద మనిషి.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్ కు చేరుకున్న కొత్త విషయాన్ని తాజాగా ప్రధాన మీడియా సంస్థ రిపోర్టు చేసింది.

దీంతో.. కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు.. అందుకు భిన్నంగా వ్యవహరించే తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ప్రశ్నిస్తున్నారు. సంచలన వ్యాఖ్యలు చేయటం..తాట తీస్తా.. తోలు తీస్తా.. లాంటి వ్యాఖ్యలు చేయటమే తప్పించి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. ప్రజా సమస్యలపై స్పందించటం.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కేసీఆర్ మొదట్నించి వెనుకగానే ఉంటారన్న విమర్శ ఉంది.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన నోటి నుంచి వచ్చే మాటలకు భిన్నంగా తన తీరు ఉండటాన్ని కేసీఆర్ వీలైనంతగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 2024 లో నల్లగొండలో నిర్వహించిన సభ సందర్భంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో మాట్లాడారని అప్పటి మాటల్ని గుర్తు చేస్తున్నారు. ‘‘ఈడికెళ్లి నేనుగూడ ఊకోను. నేను బయలుదేరుతా. ఎందాకైనా మంచిదే’’ అంటూ హెచ్చరించిన కేసీఆరర్ ఆ తర్వాత మాత్రం మళ్లీ కనిపించని పరిస్థితి. అంతేకాదు..బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ఇకపై తాను యాక్టివ్ గా ఉంటానని.. ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తానని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత కూడా ఫామ్ హౌస కే పరిమితమైన ఉదంతాల్ని ప్రస్తావిస్తున్నారు. ఊకే మాటలు చెప్పుడు.. ఫాంహౌస్ కు వెళ్లుడు తీరుకు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గులాబీ నేతలే గుసగుసలాడుకోవటం గమనార్హం.