మనవడిని చూసేందుకు ఫాంహౌస్ నుంచి కదిలొచ్చిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 7 July 2026 7:38 PM ISTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ తన ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. అకస్మాత్తుగా నగరానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన భారీ బహిరంగ సభ తర్వాత ఆయన పెద్దగా ప్రజల ముందుకు రాలేదు. రాష్ట్రంలో ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన కేసీఆర్ ఒక్కసారిగా నగరంలో ల్యాండ్ అవ్వడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. అసలేం జరిగింది?
కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుండి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. గతంలో ఆయనకు ఇక్కడే చికిత్స జరగడంతో మొదట కేసీఆర్ హెల్త్ చెకప్ కోసమే వచ్చారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ అసలు విషయం అది కాదు. తన మనవడు, కేటీఆర్ కుమారుడైన హిమాంశును పరామర్శించేందుకే కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారని తర్వాత స్పష్టమైంది.
హిమాంశుకు గాయం
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హిమాంశు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇటీవల క్రీడలు ఆడుతున్న సమయంలో ఆయనకు తీవ్రమైన గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు.
45 నిమిషాల పాటు మనవడితో ముచ్చట..
మనవడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చిన కేసీఆర్.. ఆసుపత్రిలో సుమారు 45 నిమిషాల పాటు గడిపారు. హిమాంశుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు కూడా ఉన్నారు. హిమాంశుకు అందుతున్న చికిత్స గురించి కేటీఆర్, హరీశ్ రావు ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల మలేషియాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తండ్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్న హిమాంశు.. క్రీడల్లో చురుగ్గా ఉంటారు. అయితే ఆటలాడుతూ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో గాయపడటంతో కొద్దిరోజులుగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రి వద్ద గుమిగూడిన కార్యకర్తలు
కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారనే విషయం తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఏఐజీ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను ఒక్కసారి చూసేందుకు ఆసుపత్రి వెలుపల సందడి వాతావరణం నెలకొంది. మనవడిని పరామర్శించిన అనంతరం కేసీఆర్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తిరిగి తన ఫాంహౌస్‌కు బయలుదేరి వెళ్లారు.
డిశ్చార్జ్ ఎప్పుడు?
వైద్యుల సమాచారం ప్రకారం ప్రస్తుతం హిమాంశు ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిసింది. మరో ఒకటి రెండు రోజుల్లో అవసరమైన మరికొన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ అకస్మాత్తుగా హైదరాబాద్ రావడం రాజకీయంగా హాట్ టాపిక్ అవ్వగా.. హిమాంశు త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్షిస్తున్నారు.
