Begin typing your search above and press return to search.

బాపూ.. బిడ్డ.. మౌనమే సమాధానం.. కవితతో మాట్లాడని కేసీఆర్

బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం అనంతరం పార్టీ తీరుపై తండ్రికి లేఖ రాసి అమెరికాలో కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరిమనీకి వెళ్లారు కవిత.

By:  Tupaki Desk   |   12 Jun 2025 1:03 PM IST
బాపూ.. బిడ్డ.. మౌనమే సమాధానం.. కవితతో మాట్లాడని కేసీఆర్
X

దేవుడు లాంటి తన తండ్రి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలనాత్మక ఆరోపణలు చేసి... బీఆర్ఎస్ తో ఓ దశలో తెగదెంపులు దాకా వెళ్లి.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె అనూహ్యంగా బుధవారం ఎర్రవల్లి ఫాం హౌస్ లో కనిపించారు. వాస్తవానికి కవిత కొన్నాళ్లుగా హైదరాబాద్ లేదా జిల్లాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చాక ఆమె ఎర్రవల్లిలోని తన తండ్రి ఫాంహౌస్ కు వెళ్లింది లేదు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం అనంతరం పార్టీ తీరుపై తండ్రికి లేఖ రాసి అమెరికాలో కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరిమనీకి వెళ్లారు కవిత. ఆమె అక్కడ ఉండగానే తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకై తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

ఇక కవిత తిరిగి వచ్చాక తన లేఖతో సహా పార్టీకి సంబంధించిన పలు విషయాలపై స్పందించారు. వీటిలో ముఖ్యమైనది తండ్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం గురించి. పార్టీలోని మరో నేత (కేటీఆర్)కు నోటీసులు ఇస్తే తీవ్రంగా స్పందించి, కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తే అసలు పట్టనట్లు ఉన్నారని కవిత మండిపడ్డారు. ఇలా కొన్ని రోజులు పాటు కవిత, బీఆర్ఎస్ లో రాజకీయ హంగామా సాగింది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

తాజాగా కవిత ఎర్రవల్లి ఫాంహౌస్ లో కనిపించారు. అనూహ్యంగా ఆమె తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లారు. భర్త అనిల్ కుమార్ తో కలిసి వెళ్లిన ఆమె.. కేసీఆర్ కాళేశ్వర కమిషన్ విచారణకు బయల్దేరుతున్న ఫొటోల్లోనూ కనిపించారు. అయితే, ఆమెపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

కూతురంటే అమితమైన ప్రేమ కనబరిచే కేసీఆర్.. ఫాంహౌస్ లో ఆమెతో అసలు మాట్లాడలేదని తెలిసింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బయల్దేరుతున్న సమయంలో కవిత ఫౌంహౌస్ కు చేరుకున్నారు. అయితే, ఈలోగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కింద పడడంతో బీఆర్ఎస్ నాయకులంతా ఆయన వద్దకు వెళ్లారు. ఇక గదిలోంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కవిత అక్కడే ఉన్నా కనీసం పలకరించకుండానే నేరుగా వాహనం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.