కేసీఆర్ జీతం...కాంగ్రెస్ వ్యూహం
ఇక కేసీఆర్ చూస్తే గత డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశాలలో సభకు వచ్చారు. కేవలం అయిదు నిమిషాలు మాత్రమే ఆయన సభలో ఉన్నారు.
By: Satya P | 21 March 2026 8:30 AM ISTకేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్రానికి చేశారు. ఆయన తెలంగాణాకు తొలి ముఖమంత్రిగా కూడా ఉన్నారు అయితే 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కేసీఆర్ అనుకున్న రాజకీయ వ్యూహాలు తప్పయ్యాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ హోదా మారింది. ఇక ఆయనకు ఆ హోదా ప్రకారం భారీగానే జీత భత్యాలు అందుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు జీతాలు తీసుకుంటూ సభకు కేసీఆర్ హాజరు కాకపోవడమేంటి కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తోంది.
చివరి సారిగా :
ఇక కేసీఆర్ చూస్తే గత డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశాలలో సభకు వచ్చారు. కేవలం అయిదు నిమిషాలు మాత్రమే ఆయన సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్ళిపోయారు. ఇక ఈ నెల 16 నుంచి తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం అయింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారు అని అంతా అనుకున్నారు కానీ కేసీఆర్ సభకు రాలేదు, దాంతో కాంగ్రెస్ కి ఇది అంది వచ్చిన అస్త్రంగా మారుతోంది.
ఏకంగా అంత జీతం :
కేసీఆర్ డిసెంబర్ 2023 నుంచి విపక్ష నేతగా తీసుకుంటున్న జీత భత్యాలు ఈ రోజు దాకా చూసుకుంటే 1.6 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో ప్రకటించారు. జీతాలు తీసుకుంటూ సభకు రాని వారి విషయంలో ఏమి చేయాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆలోచించాలని కూడా ఆయన వినతి చేశారు. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఆయన వచ్చి తన రాజకీయ అనుభవంతో సలహా సూచనలు ఇవ్వాలని కూడా కోరారు. కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.
అవమానమేనా :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తాము చాలు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ సభకు వస్తే అవమానించాలన్నది కాంగ్రెస్ వ్యూహం అని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తునారు. ఆయనను సభకు రావాలని పిలవడం వెనక కాంగ్రెస్ ఆలోచనలు వేరు అని అంటున్నారు. కేసీఆర్ ని గట్టిగా టార్గెట్ చేసేందుకు తగిన వ్యూహాలతో కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అంటున్నారు తెలంగాణాను కేసీఆర్ అప్పుల పాలు చేశారు అని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆయన సభకు వస్తే ఆ అంశంతో పాటు అనేక ఇతర అంశాలను కూడా ముందు పెట్టి కాంగ్రెస్ నిలదీస్తుందన్న ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని తక్కువ చేసి చూస్తుందని కూడా గులాబీ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు అని గుర్తు చేస్తున్నారు.
ఆయన ఉంటే అంతేనా :
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నన్ని రోజులూ కేసీఆర్ సభకు హాజరయ్యేది తక్కువే అని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ మీద ఆయన పరోక్షంలోనే ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు వస్తే గట్టిగానే మాట్లాడుతారు అని బీఆర్ఎస్ అంటోంది. దాంతోనే కేసీఆర్ తరచూ సభకు వచ్చేది ఉండదని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ఎంతగా పట్టుబడుతున్నా కేసీఆర్ హాజరయ్యేది లేదని కూడా అంటున్నారు. మొత్తానికి బడ్జెట్ సెషన్ లో కేసీఆర్ హాజరయ్యేది ఉండదని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
