కేసీఆర్ జీవితంలో తొలిసారి.. ఒకరి ఎదుట కూర్చొని జవాబులు ఇవ్వటం!
చేతిలో అధికారం ఉన్నా.. లేకున్నా.. తమదైన హవా నడిపించిన చివరి తెలుగు రాజకీయ అధినేతగా కేసీఆర్ ను చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 9:38 AM ISTచేతిలో అధికారం ఉన్నా.. లేకున్నా.. తమదైన హవా నడిపించిన చివరి తెలుగు రాజకీయ అధినేతగా కేసీఆర్ ను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తన చేతిలో అధికారం లేకున్నా.. భారీ ఎత్తున ప్రజల మద్దతును సొంతం చేసుకొని ఉద్యమాన్నిచేపట్టటమే కాదు.. కేంద్ర.. రాష్ట్రాల మెడలు వంచి తాను కోరుకున్న రీతిలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన చరిత్ర కేసీఆర్ సొంతం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అధికారంలో ఉన్న వారికి తల వంచే పరిస్థితి సహజంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తల ఎగరేసి మరీ.. తాను అనుకున్నది సాధించిన సన్నివేశం కేసీఆర్ రాజకీయ జీవితంలోనే చూడొచ్చు.
తన ఎదుట వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవటం లేదంటే తాను చెప్పినట్లుగా ఎదుటి వారు వినటమే తప్పించి.. ఎదుటి వారు ప్రశ్నిస్తుంటే.. తాను చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన తొలి సందర్భంగా ఆయన జీవితంలో ఇదేనని మాత్రం చెప్పక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని బరాజ్ లో జరిగిన అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు జస్టిస్ ఘోష్ కమిటీ ఎదుట హాజరు కానున్న వేళ.. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఆయన ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు.
కేసీఆర్ పొలిటికల్ లైఫ్ ను చూస్తే..ఒక దశ దాటిన తర్వాత నుంచి ఆయనకు ఎదురే లేని పరిస్థితి. ఆ మాటకు వస్తే ఆయన మాటకు ఎదురు చెప్పే పరిస్థితే ఉండేది కాదు. ఎవరి మీదనైనా ఆయన నోరు పారేసుకోవటమే తప్పించి.. ఆయనపై మండిపడటం లాంటివి తక్కువే.
తనకంటే అత్యున్నత స్థానాల్లో ఉన్న వారైనా తనకు సమాధానం చెప్పాలన్నట్లుగా ఉండటం లేదంటే వారికి స్థాయికి ఏ మాత్రం తగ్గనట్లుగా దర్పాన్ని ప్రదర్శించిన కేసీఆర్.. ఈ రోజున కమిషన్ ఎదుట కూర్చొని.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. తనకు ఏ మాత్రం అలవాటు లేని ఈ అనుభవాన్ని ఆయన ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తనకు తిరుగేలేదన్నట్లుగా ఉన్న ఆయన.. అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావటం ఆయనకు ఇబ్బందికర పరిణామంగా చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లోనూ అత్యున్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికి.. ఆయనకు ఆ సంతోషం లేకుండా తాజా విచారణ ఎపిసోడ్ ఆయన్ను చిరాకు పెట్టిస్తుందని మాత్రం చెప్పకతప్పదు.
