ఇప్పటప్పట్లో నో అంటున్న కేసీఆర్ !
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా చూస్తే తలపండిన వారు. విశేష అనుభవం కలిగిన నేత.
By: Tupaki Desk | 12 April 2025 9:20 AM ISTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా చూస్తే తలపండిన వారు. విశేష అనుభవం కలిగిన నేత. రెండు సార్లు తెలంగాణాకు సీఎం గా పనిచేసిన గులాబీ బాస్ కి రాజకీయం ఎలా చేయాలో నేర్పడం అంటే చెరువులో చేపకు ఈత నేరపడమే. కేసీఆర్ కి ఎపుడు ఏమి చేయాలో తెలుసు. అందువల్లనే ఆయన ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచే తన భవిష్యత్తు రాజకీయాన్ని రచిస్తున్నారు అని అంటున్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పదిహేను నెలలు మాత్రమే ఆ పార్టీ పవర్ లోకి వచ్చి కూడా అయింది. ఇంకా మూడు వంతుల అధికారం చేతిలో ఉంది. ఇక కాంగ్రెస్ అంటేనే గ్రూపులు. బయటకు తెలియని గొడవలు ఎన్నో ఉంటాయి. అంతే కాదు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కొన్ని చేసినా ఇంకా అందని వారు ఉన్నారు. చేయాల్సినవి మరిన్ని ఉన్నాయి.
అలాగే కాంగ్రెస్ పాలన పట్ల జనాలకు ఇపుడిపుడే కొంత అసంతృప్తి అన్నది బయటపడుతోంది. ఇది చాలదని ఇంకా పెరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా జనాలు కాంగ్రెస్ కి కోరి వరమాల వేసి తెచ్చుకున్నారు అని అందువల్ల కాంగ్రెస్ కధ పక్వానికి చేరాలని కేసీఆర్ ఆశిస్తున్నరని అంటున్నారు.
అదే విధంగా తాము ఇపుడే జనంలోకి వెళ్ళి మరీ ఎంత గొంతు చించుకున్నా కూడా ఉపయోగం ఉండదని ఆయన భావిస్తున్నారుట. సరైన సమయం వస్తే అపుడు జనాలకు తాము ఏమి చెప్పినా తారక మంత్రంగా వినిపిస్తుందని కూడా భావిస్తున్నారుట. అందుకే ఆయన జాంలోకి రావడానికి పెద్దగా ఇష్టపడడం లేదని అంటున్నారు.
ఇక ఈ నెలలో 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉంది. ఆ రోజున కేసీఆర్ బయటకు వచ్చి అధికార కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆ తరువాత ఆయన మళ్ళీ తన ఫాం హౌస్ కే పరిమితం అవుతారని అంటున్నారు.
ఇంకా నలభై అయుదు నెలల అధికారం ఉన్న కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తుందని అవే తమకు శ్రీరామ రక్ష అవుతాయని కేసీఆర్ తలపోస్తున్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ ఫాం హౌస్ లో ఊరకే కూర్చోవడం లేదుట. పార్టీని పటిష్టం చేసే వ్యూహాలను రచిస్తున్నారు పార్టీ నాయకులతో తరచూ మీటింగ్స్ పెడుతున్నారు
పార్టీని ఎలా బలోపేతం చేయాలో సూచిస్తున్నారు. మరో వైపు తనకు ఎంతో ఇష్టం అయిన వ్యవసాయన్ని దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు అని అంటున్నారు. దేనికైనా సమయం రావాలన్నది కేసీఆర్ తన విశేష అనుభవంతో గ్రహించారు అని అంటున్నారు. అందువల్ల జనం వద్దకు తాము ఎపుడు పడితే అపుడువెళ్ళడం కాదు, సందర్భం వచ్చినపుడు వెళ్ళటమే ఉత్తమం అన్న రాజనీతిని ఫాలో అవుతున్నారు అంటున్నారు అందుకే ఇప్పట్లో బయటకు వచ్చే చాన్స్ అయితే పెద్దాయనకు లేదని అంటున్నారు. బహుశా ఆయన రాజకీయం అంతా 2026 తరువాత స్టార్ట్ కావచ్చు అన్నది గులాబీ పార్టీలో ఇన్నర్ టాక్ గా ఉంది మరి.
