Begin typing your search above and press return to search.

కేసీఆర్ మళ్లీ ఎప్పుడొస్తారో..?

బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తిరిగి తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించేది ఎప్పుడు? స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్.

By:  Tupaki Desk   |   26 Dec 2025 7:00 PM IST
కేసీఆర్ మళ్లీ ఎప్పుడొస్తారో..?
X

బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తిరిగి తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించేది ఎప్పుడు? స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. 2023 డిసెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసి ఎర్రవెల్లి ఫాం హౌసుకు వెళ్లిపోయిన కేసీఆర్.. ఈ రెండేళ్లలో కేవలం ఐదుసార్లు మాత్రమే బయట ప్రపంచానికి కనిపించారు. దాదాపు రెండేళ్లుగా ఎర్రవెల్లిలోని తన ఫాం హౌసునే రాజకీయ కేంద్రంగా చేసుకుని అక్కడికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిపించుకుంటూ రాజకీయాలు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ హఠాత్తుగా ఈ నెల 21న తెలంగాణ భవన్ కు వచ్చిన విషయం తెలిసిందే. తాను ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పిన కేసీఆర్ మళ్లీ ఫాం హౌసుకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన కేసీఆర్ మళ్లీ ఎప్పుడు బయటకు వస్తారా? అంటూ చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో కేసీఆర్ కు రాష్ట్రంలో ఎవరికీ లేనంత ఇమేజ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్.. తన చేతిలో మంత్ర దండం ఉన్నట్లు అభిమానులను, కార్యకర్తలను మైమరిపించేవారని చెబుతున్నారు. అందుకే ఆయన కనిపిస్తే చాలు అన్నట్లు ఆ పార్టీలో క్రేజ్ ఉంటుంది. తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిన కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు.

తెలంగాణ సాధించిన తనను ప్రజలు తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ చెప్పుకోలేనంత నిరుత్సాహానికి లోనయ్యారని అంటున్నారు. ఆ కారణంగానే దాదాపు రెండేళ్లుగా ఆయన బయటకు రావడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. కుమారుడు కేటీఆర్ కు పార్టీని అప్పగించిన కేసీఆర్ పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ఏ మాత్రం పుంజుకోకపోవడంతోపాటు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో మరింత డీలాపడిపోయిందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని, స్థానిక ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇన్నాళ్లు ప్రచారం చేసుకుంటూ కాలం వెల్లదీసిన బీఆర్ఎస్ నేతలకు పంచాయతీ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది.

ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తేనే పార్టీ పునర్జీవం సాధిస్తుందని నమ్మిన గులాబీదళం అధినేతపై ఒత్తిడి తీసుకువచ్చి ఫాం హౌను నుంచి బయటకు తీసుకువచ్చారని అంటున్నారు. పార్టీ నేతల కోరికపై గత ఆదివారం తెలంగాణ భవన్ లో అడుగుపెట్టిన కేసీఆర్ ఇకపై తాను క్రియాశీలంగా ఉంటానని చెప్పారు. దీంతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఆశలు చిగురించినట్లు కనిపించిందని అంటున్నారు. అయితే ఇలా ప్రకటించిన అధినేత మళ్లీ ఫాం హౌసులోకి వెళ్లిపోవడం, ఆయన తిరిగి ఎప్పుడు బయటకు వస్తారో తెలియకపోవడంతో కార్యకర్తలు అయోమయం ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మాజీ సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో ఉండాలని, నిత్యం ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ తాను ఉన్నానని హెచ్చరికలు పంపాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ, కేసీఆర్ తాను ఒకసారి వస్తే చాలు.. అంతా మార్చేస్తానంటూ నమ్ముతూ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల కేడర్ లో నిరుత్సాహం ఎక్కువవుతోందని అంటున్నారు. ఈ కారణంగానే పంచాయితీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని, అధినేత అందుబాటులో లేకుంటే స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాభవం ఎదరవుతోందని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా కేసీఆర్ హైదరబాద్ లో ఉండి నిత్యం పార్టీ కేడర్ తో మమేకమయ్యాలా చూడాలని సూచిస్తున్నారు.