Begin typing your search above and press return to search.

కేటీఆర్ బ్యారేజ్ సవాల్ కు రేవంత్ 'కళరిపయట్టు'

తన ప్రతి సవాలుకు సీఎం రేవంత్ పెట్టిన కండీషన్లే కేసీఆర్ అండ్ కోకు కాస్తంత మింగుడుపడనివిగా మారతాయని చెప్పాలి. ఎందుకంటే..రేవంత్ పెట్టిన కండీషన్లు అలాంటివి.

By:  Garuda Media   |   8 July 2026 2:00 PM IST
కేటీఆర్ బ్యారేజ్ సవాల్ కు రేవంత్ కళరిపయట్టు
X

గురి చూసి కొట్టే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను లక్ష్యంగా చేసుకున్న వారికి.. సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెప్పే విషయంలో ఆయన ట్రాక్ రికార్డు తిరుగులేనిదిగా చెప్పొచ్చు. తాజాగా అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. అన్నింటికి మించి తన మీద ప్రయోగించిన అస్త్రాన్ని మధ్యలోనే అడ్డుకుంటూ.. ఆ అస్త్రాన్నే తనపై సంధించిన వారి మీద ప్రయోగించే అరుదైన యుద్ధకళ సీఎం రేవంత్ సొంతంగా చెప్పాలి.

కేరళకు చెందిన యుద్ధ కళలో కళరిపయట్టు అనేది ఒకటి. దీని ప్రత్యేకత ఏమంటే..శత్రువు కత్తితో దాడి చేస్తే.. ఒక ప్రత్యేకమైన లయతో ఆ కత్తిని క్షణంలో వెయ్యో వంతులో లాగేసి.. అంతే వేగంగా తనపై ప్రయోగించిన ప్రత్యర్థిపై దూసే తీరును కళరిపయట్టుగా చెబుతారు. జపనీస్ యుద్ధ విద్య ‘ఐకిడో’ కూడా ఆ కోవకు చెందిందే. శత్రువు కత్తి..కర్ర లాంటి ఆయుధాలతో ప్రయోగిస్తే.. దాన్ని అడ్డుకోకుండా.. ఆ వచ్చే వేగాన్ని తమకు అనుగుణంగామార్చుకొని.. ఆయుధాన్ని ప్రయోగించిన వారి చేతిని మెలితిప్పి.. ఆ ఆయుధం వారి గుండెకే గుచ్చుకునేలా చేయటం ఈ విద్య లక్షణం.

అదే సమయంలో జపనీస్ యుద్ధ విద్య ఐకిడో తీరులోనూ సీఎం రేవంత్ తీరు ఉంటుందని చెబుతారు. ఈ యుద్ధ విద్యలో శత్రువు దాడి చేసేందుకు కత్తి.. కర్రతో వస్తే.. వారి చేతినో.. ఆయుధాన్నో అడ్డుకోకుండా.. వారి నుంచి దూసుకొచ్చే వేగాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని.. వారి చేతిని మెలితిప్పి.. వారి ఆయుధం వారినే గాయపరిచేలా చేయటం. తాజా ఉదంతంలో రేవంత్ తీరు ఇదే రీతిలో ఉందని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ తీరు ఇదే తరహాలో ఉంటుంది. తన రాజకీయ ప్రత్యర్తులు విసిరే విమర్శల ఆయుధాల్ని..ఆరోపణల అస్త్రాల్ని మధ్యలోనే అడ్డుకొని.. అంతే వేగంగా.. అంతకు మించిన ఒడుపుదనంతో తనపై ప్రయోగించిన వారిపైకే వెళ్లేలా ఆయన ఎత్తులు ఉంటాయి. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తమకు అప్పగించాలని కోరుతూ ఆదివారం సవాలు విసిరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించాలని.. కేవలం వారం రోజుల్లోనే గోదావరి నీటిని ఎత్తి పోసి తెలంగాణ మొత్తానికి నీళ్లు అందించి చూపిస్తామని సవాలు విసిరారు. లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతుంటే, ఎగువన ఉన్న రిజర్వాయర్లు ఎండిపోతున్నా ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ తాజాగా రియాక్టు అయ్యారు.

కేటీఆర్ సవాలును స్వీకరిస్తూ.. తన బలమైన వాదనతో ప్రతి సవాలు విసిరారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. విసిరిన ప్రతి సవాలు ఇప్పుడు కేసీఆర్ ను ఆత్మరక్షణలో పడేసేలా మారిందని చెప్పాలి. ఇందాక చెప్పినట్లుగా కేరళ.. జపనీస్ యుద్ధ విద్యల మాదిరి తనపై కాళేశ్వరం ప్రాజెక్టు అస్త్రాన్ని సంధించిన కేటీఆర్ కు.. దాన్ని మధ్యలోనే అడ్డుకొని కేసీఆర్ ను సీన్లోకి తెచ్చి.. కాళేశ్వరం ప్రాజెక్టును వారం ఎందుకు మూడేళ్లు అప్పగిస్తానని.. ఆ ఒక్క ప్రాజెక్టు మాత్రమే కాదు మూడు బ్యారేజీలను ఇస్తానంటూ విసిరిన సవాలు ఇప్పుడు సంచలనంగా మారింది.

తన ప్రతి సవాలుకు సీఎం రేవంత్ పెట్టిన కండీషన్లే కేసీఆర్ అండ్ కోకు కాస్తంత మింగుడుపడనివిగా మారతాయని చెప్పాలి. ఎందుకంటే..రేవంత్ పెట్టిన కండీషన్లు అలాంటివి.

1. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి

2. తనకు ఎందుకు బ్యారేజీలు అప్పగించాలో కేసీఆర్ సభకు చెప్పి మెప్పించగలిగితే మూడు బ్యారేజీలు అప్పగించటానికి అభ్యంతరం లేదు.

చూసేందుకు రెండు కండీషన్లుగా కనిపిస్తున్నప్పటికి.. వాటిని అంగీకరించటం కేసీఆర్ లాంటి అధినేతకు మామూలు విషయం కాదు. విపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టటం ఇష్టపడని కేసీఆర్.. ఎవరెన్ని సవాళ్లు విసిరినా రాని పరిస్థితి. అందునా.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సభలో చర్చ పెడితే.. సీఎం రేవంత్ తన బలమైన వాదనతో కేసీఆర్ అండ్ కో డిఫెన్స్ ను బలంగా తిప్పి కొట్టటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది మర్చిపోకూడదు.

ఏదో కేటీఆర్ సవాలుకు ప్రతి సవాలు మాదిరి కాకుండా..పక్కాగా హోంవర్కు చేసిన తర్వాతే సీఎం రేవంత్ ఈ తరహా ప్రతిసవాలుకు సిద్ధమైనట్లుగా చెప్పాలి. ఇందుకు సీఎం రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని చెప్పాలి. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వాదనలో బలం ఉంటే.. ఏ తప్పు చేయకుంటే సభకు రావాలి. ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టటానికైనా సిద్ధంగా ఉన్నాం.సాగునీటి నిపుణులను.. అడ్వకేట్ జనరల్ ను సభలోకి పిలిచి మరీ చర్చ పెడదాం’’ అని చెప్పటం ద్వారా.. తాను చెప్పే ప్రతి మాటకు తాను తయారుగా ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.

అంతేకాదు.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను వినియోగిస్తున్నామని.. కేసీఆర్ కట్టిన సచివాలయాన్నికూడా వాడుకుంటున్నామన్న మాటతో.. ఆయన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ కొనసాగిస్తున్నట్లుగా చెప్పటం ద్వారా.. తాము ప్రతీకార రాజకీయాల్ని చేయటం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. సీఎం రేవంత్ పొలిటికల్ కళరిపయట్టుకు గులాబీ బాస్ వద్ద ఎలాంటి సమాధానం ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.