కవిత తిరుగుబాటును కేసీఆర్ ముందే ఊహించారా?
బీఆర్ ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. ఆపార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ సం చలనం సృష్టిస్తూనే ఉంది.
By: Tupaki Desk | 26 May 2025 9:28 AM ISTబీఆర్ ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. ఆపార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఆమె దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేశారన్న విశ్లేషణలు కూడా వస్తు న్నాయి. అయితే.. ఈ విషయాన్ని కేసీఆర్ ముందుగానే ఊహించారా? ఆయన ఎప్పుడో అలెర్ట్ అయ్యారా? ఏదో ఒక రోజు కవిత బయట పడతారని ఆయన భావించారా? అంటే.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల ను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు.
గత ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. అప్పుడు.. వేదికపై సాధారణంగా కవిత ఫొటో కూ డా ఉంటుందని ఊహించారు. కానీ, ఆమె పేరు కానీ.. ఊరుకానీ.. ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా వేదికపై కేసీఆర్ ఫొటో(కటౌట్) పక్కన కేటీఆర్ కౌటౌట్ మాత్రమే కనిపించింది. అంటే.. దాదాపు దీనిని బట్టి తన తర్వాత. పార్టీ వారసుడు ఎవరు ? అనేది కేసీఆర్ సుస్పష్టం చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించే బాధ్యతనైనా కేటీఆర్‌తోనే కేసీఆర్ సంప్రదిస్తున్నా రు.
సో.. దీనినిబట్టి.. కవితకు పార్టీలో నాయకురాలిగా మాత్రమే కేసీఆర్ గుర్తించారు తప్ప.. ఆమెకు బాధ్యతా యుతమైన పదవులు ఇచ్చేందుకు అంగీకరించలేదన్న పరిస్థితి కూడా అర్ధమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు.. కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆమెకు పార్టీ తరఫున ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత వరకు మాత్రమేపరిమితం చేశారు. పైగా.. కేటీఆర్ తో పోల్చుకుంటే.. కవిత రాజకీయంగా అనేక మెట్లు ఎక్కాల్సి ఉందన్న అభిప్రాయంలోనూ కేసీఆర్ ఉన్నారు.
కేటీఆర్ ఇప్పటి వరకు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఓడింది లేదు. కానీ, కవిత నిజామాబాద్‌లో తొలిసారి విజయం దక్కించుకున్నా.. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆమె ఓడిపోయారు. ఇది కూడా ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. పైగా. కేటీఆర్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్.. ప్రజల్లో ఉన్న పలుకుబడి.. వంటివికవితకు తక్కువగానే ఉన్నాయి. పైగా కేసీఆర్ వారసుడిగా పార్టీ కేటీఆర్‌నే అనుమతిస్తుందన్నది అనేక సందర్భాల్లోనూ రుజువైంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే తన వారసుడిగా .. కేటీఆర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారన్నది విశ్లేషకులు చెబుతున్నారు.
