Begin typing your search above and press return to search.

దేవుడు.. దెయ్యం.. మాటలు సింక్ కావట్లేదు కవితక్క?

గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు. అయితే.. అయినోళ్ల కారణంగా ఇరుకున పడే పరిస్థితి ఆయనకు ఇదే మొదటిసారిగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   24 May 2025 2:58 PM IST
Power Struggles and Family Dynamics in Telangana Political Landscape
X

గులాబీ తోటలో కుటుంబ ఆధిపత్య పోరు మొదలైందా? పవర్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటమే కాదు.. ఎవరి దారి ఎవరిదన్న విషయంపై స్పష్టత మరికొద్ది రోజుల్లో వచ్చేయనుంది. ఊరిని ఏలేటోడికి ఇంట్లో మాత్రం ఈగల మోత తప్పదన్న దానికి కేసీఆర్ సైతం మినహాయింపు కాదన్న సత్యం తాజాగా నిరూపితమైంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు సలహాలు.. సూచనలు ఇచ్చే దమ్ము.. ధైర్యం చేయనోళ్లు పవర్ చేతిలో లేని వేళలో నోరు విప్పటం మామూలే. అయితే.. అది కుటుంబ సభ్యులు కావటంతోనే అసలు తలనొప్పి అంతా.

గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు. అయితే.. అయినోళ్ల కారణంగా ఇరుకున పడే పరిస్థితి ఆయనకు ఇదే మొదటిసారిగా చెప్పాలి. అది కూడా తన రక్తం పంచుకుపుట్టిన కుమార్తె.. తనకు సలహాలు చెప్పే పరిస్థితి రావటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. కేసీఆర్ దేవుడని కీర్తించిన కవిత.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పటం ద్వారా తప్పులో కాలేశారని చెబుతున్నారు. ఎందుకంటే.. దేవుడు ఎప్పుడూ తన చుట్టూ దెయ్యాల్ని ఉంచుకోడు కదా? ఈ సింక్ కాని పోలిక పెద్ద ప్రశ్నగా మారింది.

తాను తన తండ్రికి రాసిన లేఖ గురించి మాట్లాడుతూ.. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు లేఖ లీక్ అయినట్లుగా పేర్కొన్నారు. ఈ వాదన కూడా సింక్ కాలేదనే చెప్పాలి. కారణం.. కేసీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా కొడుకు కేటీఆర్.. కుమార్తె కవితను తీసుకుంటే.. బహిరంగ వేదికల్లోనే కాదు.. సమీక్షా సమావేశాల్లో.. మరింత క్లియర్ గా చెప్పాలంటే ఇంటి బయట జరిగే ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ ను ఉద్దేశించి తండ్రిగా సంబోధించిన తీరు కనిపించదు. ఎంతసేపటికి తమ నాయకుడు.. తమ అధ్యక్షుడు అని మాత్రమే తప్పించి.. మా నాన్న అంటూ పిలిచిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అలాంటప్పుడు పార్టీకి సంబంధించి చేపట్టాల్సిన మార్పుల గురించి కవిత ‘డాడీ’ పేరుతో లేఖ రాయటం ఏమిటి? అన్నది ప్రశ్న.

ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ కూడా పార్టీ అధ్యక్షుల వారికే అయినప్పుడు తండ్రి పాత్రను ఎందుకు తీసుకొచ్చినట్లు? గతంలో తాను చాలా లేఖలు రాశానని.. ఈసారి లేఖ మాత్రమే లీక్ అయినట్లుగా ఆమె చెప్పారు. ఇక్కడే ఆమె మాటల్లో సింక్ కాని మరో అంశాన్ని ప్రస్తావించాలి. కవిత తన తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అవుతుంది? సాధారణంగా ఆమె తన స్వహస్తాలతో రాసిన లేఖను.. తన తండ్రికి అందేలా చేయాలంటే ఒకరిద్దరి ద్వారానే పంపుతారు. కవిత ఇచ్చిన లేఖను బయటకు లీక్ చేసే ధైర్యం.. సాహసం చేయగలరా? ఒకవేళ చేశారే అనుకుందాం? కేసీఆర్.. కేటీఆర్ లాంటోళ్లు ఒప్పుకుంటారా? వారి సంగతి చూడరా?

అంటే.. కవిత లేఖ లీక్ కావటం అంటే బయట వారితో అయ్యే పని కాదు. ఇంట్లో వాళ్లతోనే అవుతుంది. ఆ వాదనే నిజం అనుకుంటే.. ఇంట్లో వాళ్లే కవిత మీద కుట్రలు పన్నుతున్నారా? ఒకవేళ అలా పన్నితే ఆ విషయాన్ని ఓపెన్ గా ఎందుకు చెప్పట్లేదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తనపై కుట్రలు జరుగుతున్నట్లుగా ఈ మధ్యనే చెప్పానని చెప్పిన కవిత..తనపైన అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు.. తనను ఇరుకున పడేసే ప్రమాదం ఉందని భావించినప్పుడు.. ఆమె లేఖ ఎందుకు రాసినట్లు?

ఒకవేళ రాస్తే.. దాన్ని తన తండ్రికి నేరుగా అందేలా ఎందుకుచర్యలు తీసుకోలేదు. అసలు ఇదంతా ఏంటి? లేఖ ఎందుకు.. నాన్న నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నా.. అంటే.. బేటా వద్దు.. అని కేసీఆర్ అంటారా? నిజానికి కవిత అంటే కేసీఆర్ సారుకు చాలా ఇష్టమని.. ఆడపిల్లగా ఆమెకు పెద్దపీట వేస్తారని చెబుతారు. అలాంటి తండ్రి వద్దకు వెళ్లి.. విషయాల్ని సూటిగా స్పష్టంగా ఎందుకు చెప్పనట్లు? అన్నది ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలతో చూసినప్పుడు కవిత చెప్పే దేవుడు.. దెయ్యాల వాదన అస్సలు సింక్ కావట్లేదని చెప్పక తప్పదు.