సీఎంను పెద్దాయనే ‘నా కొడకా’ అంటే.. కుర్రోడు ఇంకేమనాలి?
అదేమంటే.. ఉద్యమ నాయకుడి ట్యాగ్ ను బయటకు తీసి.. ఆక్రోశంతో వస్తున్న మాటలే తప్పించి.. మరేమీ లేదన్నకవరింగ్ ఇస్తారు.
By: Garuda Media | 21 April 2026 12:12 PM ISTఅంత పెద్ద మనిషిని పట్టుకొని అన్నేసి మాటలు అంటారా? వయసుకు మర్యాద.. గౌరవం ఇవ్వొద్దా? అంటూ అప్పుడప్పుడు గులాబీ బాస్ కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ తరచూ మర్యాదల గురించి మాట్లాడుతుంటారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గౌరవ మర్యాదల్ని.. భాషను భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్ అండ్ కోదే అని చెప్పాలి. దీనికి ఆద్యుడిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్పాలి.ఆయన మాటల్లో దూకుడు ఉంటుంది. ఆవేశం ఉంటుంది. మాట జారటం అస్సలు కనిపించదు.
వైఎస్ అప్ గ్రేడ్ వెర్షన్ మాదిరి కేసీఆర్ కనిపిస్తారు. అవసరానికి మించిన ఆవేశం.. రెచ్చగొట్టేలా మాట్లాడటం.. మర్యాదల్ని పక్కన పెట్టేసి.. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తూ.. అందరి చూపు తన మీద పడేలా మాటలు మాట్లాడటం.. గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టేసే తెగింపు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రిని మొదలు కొని ఎవరినైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడటం కేసీఆర్ కే చెల్లుతుంది.
అదేమంటే.. ఉద్యమ నాయకుడి ట్యాగ్ ను బయటకు తీసి.. ఆక్రోశంతో వస్తున్న మాటలే తప్పించి.. మరేమీ లేదన్నకవరింగ్ ఇస్తారు. అలాంటి కేసీఆర్ ను.. అంతే ఆక్రోశంతో ఇంకెవరైనా మాటలు అంటే.. వెంటనే వయసు కనిపించట్లేదా? బుద్ధి మందగించిందా? గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? లాంటి మాటలతో విరుచుకుపడతారు. అయితే.. కేసీఆర్ కు అప్ గ్రేడ్ వెర్షన్ గా తెలంగాణ సీఎం రేవంత్ ను చెప్పాలి. అయితే.. ఇక్కడ కేసీఆర్ కు.. రేవంత్ కు ఒక పెద్ద తేడా ఉంది.
తన రాజకీయ అవసరానికి తగ్గట్లు.. మాటల్ని.. మర్యాదల్ని మార్చేసే విషయంలో కేసీఆర్ ముందుంటారు.ఈ విషయంలోనూ రేవంత్ కాస్త వెనుకబడే ఉంటారని చెప్పాలి. కాకుంటే.. తాను ఒకసారి ఫిక్స్ అయితే.. ఫలానా వారి సంగతి చూడాలని చూస్తే మాత్రం.. మాటలతో చీల్చి చెండాటమే కాదు.. మర్యాద హద్దుల్ని దాటేసే విషయంలో కేసీఆర్ కంటే మొండిఘటంగా కనిపిస్తారు. అందుకే.. అందరిని అన్నేసి మాటలు అనే కేసీఆర్ అండ్ కో సైతం.. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు చాలా ఇబ్బందిని.. అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే కాబోలు.. రాజకీయాల్లో దరిద్రపుగొట్ట భాషను తెచ్చిన ఘనత తమకు ఉన్నప్పటికి.. ఆ విషయాన్ని వదిలేసి.. రేవంత్ రెడ్డి మాటలకు స్పందిస్తూ.. మర్యాద ఇవ్వరా? పెద్ద మనిషికి గౌరవం ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తారు.
తాజాగా నిర్వహించిన జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘‘పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలె అంటరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా! పిల్లి శాపానికి ఉట్టి తెగిపడతదా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి..’’అంటూ విరుచుకుపడిన తీరు చూస్తే.. ఆయన ఫస్ట్రేషన్ ఎవరి మీదనే అర్థమవుతుంది.
ఇక్కడే అసలు ప్రశ్న తెర మీదకు వస్తుంది. నిత్యం గౌరవ మర్యాదల గురించి మాట్లడేవారు.. నా కొడకా అన్నది ఎవరిని ఉద్దేశించిందో అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అలా నోరు పారేసుకోవటం సరైనదేనా? అన్నది ఇక్కడ ప్రశ్న. అదే సమయంలో.. వయసులో పెద్దగా ఉన్నప్పుడు మర్యాదల్ని పెంచేలా మాట్లాడాలే తప్పించి.. తగ్గించి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండన్నది కేసీఆర్ ఎప్పుడు గ్రహిస్తారు.
72 ఏళ్ల వయసున్న పెద్దమనిషి పెద్దరికాన్ని వదిలేసి.. నోటికి వచ్చిన తిట్టు తిడుతున్నప్పుడు.. అంతకంటే ఒకటిన్నర దశాబ్దం తక్కువ వయసున్న మరొకరు తన నోటికి పని చెప్పేలా రెచ్చగొట్టటం ఏమిటి? అన్నది ప్రశ్న. మర్యాదల ప్రోటోకాల్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఒక మెట్టు కిందనే కేసీఆర్ ఉన్నారని చెప్పాలి. అలాంటప్పుడు అత్యుత్తమ పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఇలా నోరు పారేసుకోవటం ఎంతవరకు సబబు? అన్నది అసలు ప్రశ్న. మనం ఏం ఇస్తే అదే మనకు తిరిగి లభిస్తుందన్న నానుడికి తగ్గట్లు.. నోరు పారేసుకోవటమే ఆయుధంగా భావిస్తే.. ఆ తరహాలోనే మాటలు పడాల్సి వస్తుందన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కాదంటారా?
