గులాబీ బాస్ ఆరోగ్యానికి ఏమైంది? ఆసుపత్రిలో జాయిన్ అయ్యారెందుకు?
కొన్ని అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారం గురించి మాట్లాడుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
By: Tupaki Desk | 4 July 2025 11:59 AM ISTకొన్ని అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారం గురించి మాట్లాడుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతో హైదరాబాద్ సోమాజీగూడ ఆసుపత్రిలో జాయిన్ కావటం తెలిసిందే. గురువారం రాత్రి వేళలో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే.. ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతారన్న అంశం గురువారం ఉదయం నుంచి చర్చ మొదలైంది.కాకుంటే.. మధ్యాహ్న సమయంలో ఆసుపత్రిలో చేరతారన్న అంచనాలు ఉన్నాయి. కాకుంటే.. కారణం ఏమిటన్న దానిపై క్లారిటీ లేదు కానీ రాత్రి వేళలో ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేవారు.
గడిచిన రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం.. పరీక్షల కోసం యశోదకు వచ్చిన ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న యశోదా ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ‘నీరసంతో బాధ పడుతున్న కేసీఆర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయిలు అధికంగా.. సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. షుగర్.. సోడియం సాధారణ స్థాయికి వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షనలో చికిత్స పొందుతారు’ అంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు.
నిజానికి కొన్ని దశాబ్దాలుగా డాక్టర్ ఎంవీ రావు కేసీఆర్ కు వైద్య సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ చేరే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు గులాబీ బాస్ వెంటే ఉన్నారు. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
యశోదా ఆసుపత్రి వర్గాలతో మాట్లాడిన సీఎం రేవంత్.. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న ఆకాంక్షను సీఎం రేవంత్ వ్యక్తం చేస్తే.. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా నంది నగర్ లోని ఇంట్లోనే కేసీఆర్ ఈసారి కొద్ది రోజులు ఉంటారని. ఫాం హౌస్ కు వెళ్లరని చెబుతున్నారు. ఏమైనా.. అనారోగ్యం నుంచి కేసీఆర్ వెంటనే కోలుకోవాలని కోరుకుందాం.