Begin typing your search above and press return to search.

హరీష్ తండ్రి మృతి.. దూరంగా కవిత.. నాటి ఆరోపణల వల్లేనా?

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మృతి చెందిన సందర్భంలో కల్వకుంట్ల కవిత హాజరు కాకపోవడం, కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.

By:  Tupaki Desk   |   28 Oct 2025 3:51 PM IST
హరీష్ తండ్రి మృతి.. దూరంగా కవిత.. నాటి ఆరోపణల వల్లేనా?
X

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మృతి చెందిన సందర్భంలో కల్వకుంట్ల కవిత హాజరు కాకపోవడం, కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. గతంలో కవిత స్వయంగా బావ అయిన హరీష్ రావుపై చేసిన ఫండింగ్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ గైర్హాజరును రాజకీయ వర్గాలు సీరియస్‌గా చూస్తున్నాయి.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు (80) మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని కొండాపూర్ నివాసంలో కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు , ఆయన కుమారుడు కేటీఆర్ నేరుగా హరీశ్ రావు నివాసానికి చేరుకుని సత్యనారాయణ రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అయితే ఈ కీలక సమయంలో కేసీఆర్ కుటుంబానికి చెందిన మరో ముఖ్య సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం నివాసానికి హాజరుకాలేదు. ఆమె హాజరు కాకపోవడం బీఆర్‌ఎస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

* కవిత దూరం.. కారణం రాజకీయ విభేదాలేనా?

కవిత హాజరు కాకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా గతంలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాలనే కారణంగా పేర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా కవిత, హరీశ్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి అంతర్గత పోరు నడుస్తోంది. కవిత పలుమార్లు హరీశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను ఓడించేందుకు హరీశ్ రావు ప్రత్యర్థి పార్టీలకు డబ్బు పంపారంటూ కవిత బహిరంగంగా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమని, వీరి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీని కుదిపేశాయి.

ఈ ఆరోపణల పరంపర తర్వాత, కుటుంబంలో ఇంతటి విషాదకర ఘటన జరిగినప్పటికీ, కవిత వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం కుటుంబంలోనూ, పార్టీలోనూ పరిస్థితులు చక్కబడలేదని స్పష్టం చేస్తోంది. కుటుంబ బంధానికి, రాజకీయ వైరుధ్యానికి మధ్య కవిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.

* 'జనంబాట' కారణంగా గైర్హాజరు

కవిత హాజరు కాకపోవడానికి ఆమె ప్రస్తుతం చేపట్టిన 'జాగృతి జనంబాట' కార్యక్రమమే కారణమని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 25న నిజామాబాద్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో కొనసాగనుంది.

సత్యనారాయణ రావు మృతిపై కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేవలం ఒకే ఒక ట్వీట్‌లో “సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో హరీశ్‌ను వ్యక్తిగతంగా పరామర్శించిన దాఖలాలు లేవు, అలాగే కుటుంబ చిత్రాలు ఏవీ పోస్ట్ చేయలేదు.

* బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై కొత్త చర్చ

తండ్రి మరణించినప్పుడు కేసీఆర్, కేటీఆర్ హాజరై కవిత దూరంగా ఉండటం.. కల్వకుంట్ల కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, రాజకీయ వారసత్వ పోరు తీవ్రరూపం దాల్చాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు కవిత బీఆర్‌ఎస్‌ను పక్కనపెట్టి 'తెలంగాణ వాదం'తో సొంత రాజకీయ మార్గాన్ని అన్వేషిస్తుండగా, మరోవైపు హరీశ్ రావు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద మరణం కూడా ఈ రాజకీయ విభేదాలకు అడ్డుకట్ట వేయలేకపోవడం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. కవిత వ్యక్తిగతంగా హరీశ్‌ను పరామర్శించాల్సిందిగా నెటిజన్లు, పార్టీ అనుచరులు సూచిస్తున్నారు.

కుటుంబ కలహాలు, అంతర్గత విబేధాలు బహిర్గతమవుతున్న ఈ తరుణంలో బీఆర్‌ఎస్ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.