పాకిస్తాన్ గురించి కేసీఆర్ అప్పుడే చెప్పాడు.. వైరల్ వీడియో!
అధికారంలో ఉన్నప్పుడు నాయకులు చేసే వ్యాఖ్యలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి.
By: Tupaki Desk | 25 April 2025 7:30 PMఅధికారంలో ఉన్నప్పుడు నాయకులు చేసే వ్యాఖ్యలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. ఆ సమయంలో వారి మాటలకు అడ్డు అదుపు ఉండకపోవచ్చని, తర్కం లోపించవచ్చని కొందరు విమర్శిస్తుంటారు. అయితే, అధికారంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని.. తమ నాలుకపై పట్టు కలిగి ఉండాలని, హుందాగా వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నాయకులు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. కాబట్టి, ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మాటతీరు తరచుగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దేశ ప్రధాని విషయంలో ఆయన ప్రవర్తన విభిన్నంగా ఉండేదని పరిశీలకులు అంటారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని అత్యంత అవినీతి రహిత ప్రధానిగా కేసీఆర్ ప్రశంసించారు. కానీ, తెలంగాణలో బీజేపీ బలపడటం, తన కుమార్తె ఓటమి తర్వాత కేసీఆర్ వైఖరి మారిందని, ప్రధాని రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా మంత్రులను పంపించి అవమానపరిచారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
నిండు శాసనసభలో సైతం ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారని, చివరికి పాకిస్తాన్ వంటి సున్నితమైన విషయాన్ని కూడా తేలికగా తీసుకున్నారని ఆయన పాత వీడియోలతో ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. . పాకిస్తాన్ భౌగోళికంగా, సైన్యం పరంగా మన దేశం కన్నా చాలా చిన్నదని, కశ్మీర్‌లో నిత్యం సమస్యలున్నా, భారత్ తలచుకుంటే పాకిస్తాన్ పని క్షణంలో పూర్తవుతుందని అప్పట్లో కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఏమీ చేయడం లేదనే వ్యాఖ్యానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి కేసీఆర్ చెప్పినంత సులభం కాదు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం అనేది నిపుణుల అభిప్రాయం. పాకిస్తాన్ చిన్న దేశమే అయినప్పటికీ, దానికి ఉగ్రవాదుల అండ ఉందని, అది ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వారు పేర్కొంటున్నారు. దీనివల్లే సరిహద్దుల్లో హింస చోటు చేసుకుంటోందని వారు అంటారు. అంతేకాకుండా, అమెరికా, చైనా వంటి దేశాలు తెర వెనుక పాకిస్తాన్‌కు సహకారం అందిస్తున్నాయని, అందువల్లే ఆ దేశం అంతలా రెచ్చిపోతుందని వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారు.
ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ ఆనాడు అలాంటి వ్యాఖ్యలు చేశారంటే, దాని వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి, రాజకీయాలు వేరు, దేశ భద్రత, అంతర్గత సమస్యలు వేరు. అయితే, దేశ భద్రత వంటి సున్నితమైన అంశాలలో కూడా రాజకీయాలు వెతుక్కోవడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.