బీఆర్ఎస్ ప్రక్షాళనకు కేసీఆర్ శ్రీకారం: అన్ని కమిటీల రద్దు - కేటీఆర్‌కు కీలక బాధ్యతలు!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
By: A.N.Kumar | 27 April 2026 8:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసేలా పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే ఉద్దేశంతో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పార్టీ ప్రక్షాళన.. అన్ని స్థాయిల కమిటీల రద్దు
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం పార్టీ కమిటీల రద్దు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని అనుబంధ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నిర్మాణంలో లోపాలను గుర్తించిన అధినేత, పార్టీని మళ్లీ మొదటి నుంచి నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా నిష్క్రియాత్మకంగా ఉన్న కమిటీలను తొలగించి.. చురుకైన కార్యకర్తలకు చోటు కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతోంది.
కేటీఆర్‌కు కీలక బాధ్యతలు.. శిక్షణే లక్ష్యం
కొత్త కమిటీల నియామకం.. వాటికి అవసరమైన దిశానిర్దేశం చేసే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టీ. రామారావు (కేటీఆర్) కు అప్పగించారు. కేవలం కమిటీలను వేయడమే కాకుండా కొత్తగా ఎన్నికయ్యే నాయకులకు పార్టీ సిద్ధాంతాలు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధానాలపై ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం... డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించడం... ప్రజల్లోకి పార్టీ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లడం... ఈ మూడు అంశాలే ప్రాతిపదికగా కేటీఆర్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు.
సభ్యత్వ నమోదు.. కేడర్‌లో నూతనోత్సాహం
పార్టీ బలాన్ని అంచనా వేయడానికి.. విస్తరించడానికి సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. "పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి ఇంటికీ బీఆర్ఎస్ చేరువయ్యేలా సభ్యత్వ నమోదు జరగాలి" అని ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ఈసారి సభ్యత్వ నమోదులో సాంకేతికతను విరివిగా ఉపయోగించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల కార్యకర్తల డేటాబేస్ పక్కాగా ఉంటుందని పార్టీ భావిస్తోంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన వ్యూహం ఉంది.. ఎన్నికల తర్వాత కేడర్‌లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి, వారిని మళ్లీ యాక్టివ్ చేయడం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టడం... కేటీఆర్‌కు శిక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీపై ఆయన పట్టును మరింత పెంచడం ధ్యేయంగా కనిపిస్తోంది..
మొత్తానికి కేసీఆర్ తీసుకున్న ఈ "సర్జికల్ స్ట్రైక్" వంటి నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయని శ్రేణులు భావిస్తున్నాయి. కమిటీల రద్దు, కొత్త నాయకత్వానికి శిక్షణ, భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో కొత్త కమిటీల నియామకం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.
