Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి అదే తారకమంత్రం !

పాతికేళ్ళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్ స్పీచ్ మీద అందరికీ ఆసక్తి ఉంది.

By:  Tupaki Desk   |   28 April 2025 6:00 AM IST
కేసీఆర్ కి అదే తారకమంత్రం !
X

పాతికేళ్ళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్ స్పీచ్ మీద అందరికీ ఆసక్తి ఉంది. ఆయన ఏమేమి మాట్లాడుతారో అని అంతా అనుకున్నారు ఇక కేసీఆర్ సభలో చాలానే మాట్లాడారు. అయితే ఆయన ఎక్కువగా తన ప్రసంగంలో తెలంగాణా చుట్టూనే తిప్పుతూ ఆవేశపూరితంగా మాట్లాడారు. తెలంగాణా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని గులాబీ పార్టీకి ఆ సెంటిమెంట్ ని మరింత దట్టంగా అంటించారు.

నాడు టీఆర్ ఎస్ లేకపోతే తెలంగాణా రాష్ట్రం అన్నది వచ్చేది కాదని అన్నారు. మరో వైపు చూస్తే ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పదవులు హోదాలు ఏవీ టీఆర్ఎస్ ఆశించలేదని అన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయం మీద గట్టిగా నిలబడి కొట్లాడిన పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు.

ఇక 2014 నుంచి 2023 దాకా తమ పాలనలో స్వర్ణ యుగం చూపించామని ఆయన చెప్పారు. కేవలం ఏణ్ణర్ధంలో అంతా ఆగమాగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తెలంగాణా అన్నది ఎంతో అగ్ర భాగాన ఉందని అన్ని ర్యాంకింగులలో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న తెలంగాణాను కాంగ్రెస్ తన పాలనలో వెనక్కి నెట్టిందని కేసీఆర్ విమర్శలు చేశారు.

ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కూడా నిందించారు. కాంగ్రెస్ పార్టీ వస్తేన ఇలాగే ఉంటుందని అన్నారు కల్లబొల్లి హామీలతో ఓట్లు వేయించుకుని చివరికి ఈ విధంగా చేస్తారని కూడా అన్నారు. తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. నా కళ్ళ ముందే తెలంగాణా ఇలా అవుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణాకు కాంగ్రెస్ ఈ గతి పట్టించిందని అన్నారు. మళ్ళీ 2014 నాటి పరిస్థితులే కనిపిస్తునాయని అన్నారు. ఈసారి ప్రజలు అయితే కాంగ్రెస్ ని అసలు నమ్మరని అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం తధ్యమని కేసీఆర్ జోస్యం చెప్పారు.

అయితే కేసీఆర్ తన స్పీచ్ మొత్తంలో ఎక్కువగా తెలంగాణానే తలచుకున్నారు. 2001 లో పుట్టిన టీఆర్ఎస్ నుంచి 2014 వరకూ ఆ పార్టీ సాగించిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. తెలంగాణాకు పర్యాయపదం గులాబీ పార్టీ అనేలా ఆయన స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణా అస్థిత్వం ఉనికి అన్నీ కూడా బీఆర్ ఎస్ తోనే ముడిపడి ఉన్నాయని గట్టిగా జనం మెదళ్ళలోకి వెళ్ళేలా చేశారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని ఆయన తూర్పారా పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే మొత్తం కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ గాంధీలూ అంటూ అగ్రనేతలను కూడా ఆయన లక్ష్యం చేసుకుని విమర్శించారు. బీజేపీని ఒక బ్రబ్రాజమానం పార్టీగా ఆయన పేర్కొంటూ లైట్ తీసుకున్నారు.

అంటే తెలంగాణాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదని ఉండదని కేసీఆర్ అభిప్రాయంగానే చూడాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీఆర్ఎస్ ముందు ప్రత్యర్ధి పార్టీలు ఏమీ కావని ప్రజలకు ఏమీ చేయలేవని బలంగా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు.

ఏది ఏమైనా కేసీఆర్ తెలంగాణాయే గులాబీ పార్టీకి జీవనాడి అని గుర్తించారని అంటున్నారు. అంతే కాదు ఉద్యమ పార్టీ అని జనాలకు గుర్తు చేయడం ద్వారా నాటి సెంటిమెంట్ ని మరింతగా పదును పెట్టి రానున్న కాలంలో కారు జోరుని పెంచాలని అనుకుంటున్నారుగా ఉంది. ఏది ఏమైనా కేసీఆర్ స్పీచ్ ద్వారా బీఆర్ ఎస్ క్యాడర్ ని మాత్రం బాగానే ఉత్సాహపరిచారు అని అంటున్నారు.