తొలిసారి గులాబీ బాస్.. తెలంగాణలో చరిత్రలో సరికొత్త సీన్
తెలంగాణ జాతిపితగా పిలిపించుకున్న గులాబీ బాస్ కేసీఆర్.. తన పదేళ్ల పాలనలో (తొమ్మిదిన్నరేళ్లు) కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణంలో అవకతవకలపై విచారణను ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 11 Jun 2025 9:36 AM ISTఅవును.. ఈ రోజు (బుధవారం) తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన రోజుగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏళ్లకు ఏళ్లు పోరాడి.. తెలంగాణ జాతిపితగా పిలిపించుకున్న గులాబీ బాస్ కేసీఆర్.. తన పదేళ్ల పాలనలో (తొమ్మిదిన్నరేళ్లు) కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణంలో అవకతవకలపై విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ కు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి విచారణను ఎదుర్కోవటం ఇదే తొలిసారి. అయితే.. రానున్న రోజుల్లో ఇదో అలవాటుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంతకూ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు ఎందుకు హాజరువుతున్నారు? అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. గతంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబరు 21న కుంగిపోగా.. అన్నారం.. సుందిళ్ల బరాజ్ లలో సైతం లోపాలు వెలుగు చూశాయి. ఈ మూడు బరాజ్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే కమిషన్ పలువురిని విచారణకు ఆదేశించి.. వారి నుంచి సమాచారాన్ని సేకరించింది. అందులో బరాజ్ ల ప్లాన్.. డిజైన్ల తాయరీ.. నిర్మాణంతో పాటు నిర్వహణ.. పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లు.. నిర్మాణ సంస్థల ప్రతినిధులు.. ఐఏఎస్ లు.. మాజీ ఐఏఎస్ లు తదితరులు ఉన్నారు. కీలకమైన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన కమిషన్ ఈ రోజు కేసీఆర్ ను క్రాస్ చేయనున్నారు.
ఈ విచారణలో భాగంగా ఈ నెల ఆరున అప్పటి ఆర్థిక మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. తొమ్మిదిన అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్ రావును ప్రశ్నించింది. చివరగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించనుంది. ఇప్పటికే కమిషన్ గుర్తించిన అవకతవకలను కేసీఆర్ ముందు ఉంచి.. ఆయన వివరణ కోరనున్నారు. దీంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అవుతుంది. ప్రభుత్వానికి వచ్చే నెలాఖరు వరకు కమిషన్ తన రిపోర్టును అందించనుంది. మొత్తంగా కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరవుతున్న వైనం తెలంగాణ చరిత్రలో ఒక అరుదైన ఘటనగా మిగులుతుందని మాత్రం చెప్పక తప్పదు.