Begin typing your search above and press return to search.

కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ.. లోపల ఏం జరిగిందంటే?

తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అన్యాయాలు, అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై 50 నిమిషాల పాటు విచారణ ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 8:27 AM
కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ.. లోపల ఏం జరిగిందంటే?
X

తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అన్యాయాలు, అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై 50 నిమిషాల పాటు విచారణ ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్ కేసీఆర్‌ను వన్ టూ వన్ గా విచారించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 12:50 గంటలకు ముగిసింది. అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు.

ఈ విచారణ సందర్భంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పత్రాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఫైల్ కమిషన్‌కు అందించారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కమిషన్‌కు తెలిపిన నేపథ్యంలో కమిషన్ కేసీఆర్‌ను ఓపెన్ కోర్టులో కాకుండా 'ఇన్ కెమెరా' విధానంలో విచారించింది. ఈ విధానంలో కమిషన్ ఛైర్మన్ ఘోష్, కేసీఆర్ మాత్రమే హాజరయ్యారు. మొత్తం విచారణను కెమెరాలో రికార్డు చేశారు. ఇంతకు ముందు మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్ రావులను కూడా కమిషన్ ఓపెన్ కోర్టులో విచారించిన విషయం తెలిసిందే. అయితే హరీశ్ రావు విచారణ అనుభవాన్ని తెలుసుకున్న కేసీఆర్ వ్యక్తిగతంగా కమిషన్ ఛైర్మన్‌ను కోరడంతో కమిషన్ ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది.

విచారణలో ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, బ్యారేజీల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వల అంశాలపై కేసీఆర్‌ను పీసీ ఘోష్ ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ దశలో కమిషన్ ఇప్పటి వరకు మొత్తం 115 మందిని విచారించింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, సీపేజ్ సమస్యలతో సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అధికారులే కాక నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారించింది.

విచారణ ముగిసిన వెంటనే కేసీఆర్ నేరుగా యశోదా ఆసుపత్రికి వెళ్లారు. ఇటీవల సిద్దిపేటలోని ఫాంహౌస్‌కు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తూ జారి పడడంతో తుంటి ఎముకకు గాయమైంది. ప్రస్తుతం ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ఆయన్ను పరామర్శించనున్నారు.

ఇప్పటి వరకు 114 మంది అధికారులు, మాజీ మంత్రులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల సమాజంలో ఏర్పడిన అనుమానాలు, వివాదాల నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విచారణతో ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.