'కేసీఆర్ సర్..' ఇప్పుడు కూడా పంతమేనా?
అయితే.. కేసీఆర్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పోనీ.. సర్కారు నుంచి ఆహ్వానం అందలేదని అనుకుందామా? అంటే.. అదేమీ లేదు.
By: Tupaki Desk | 6 April 2025 3:55 AM''పంతానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి'' అని గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేది లేదని భీష్మించినప్పుడు.. సీఎంగా కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, తన వరకు వస్తే మాత్రం పంతానికి పరాకాష్ఠగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన.. రాష్ట్ర సమాచార కమిషనర్‌ను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సమావేశానికి సీఎం సహా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇది నిబంధన కూడా.
అయితే.. కేసీఆర్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పోనీ.. సర్కారు నుంచి ఆహ్వానం అందలేదని అనుకుందామా? అంటే.. అదేమీ లేదు. రెండు సార్లు ఆహ్వానాలు పంపించారు. అధికారి ఒకరు నేరుగా ఫోన్ చేసి కేసీఆర్ ఆఫీసుకు సమచారం అందిం చారు. సమయం, వేదిక, విషయం ఇలా.. అన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. కానీ, కేసీఆర్ మాత్రం రాలేదు. అయితే.. అయ్య గారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? అన్న చందంగా.. ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆపకుండా కానిచ్చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసి రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమించే ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు.
మొత్తంగా సీఎం, విపక్ష నాయకుడు కలిసి.. ముగ్గురిని ఎంపిక చేసి.. గవర్నర్‌కు పంపించనున్నారు. అనంతరం.. ఆయన ఒకరిని ఎంపిక చేస్తారు. ఇది రాజ్యాంగబద్ధమైన అధికారంతో కూడిన పదవి. దీంతో విపక్ష నాయకుడికి కూడా.. ఈ కమిటీలో చోటు కల్పించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. కాగా.. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ... ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దీంతో ఎవరినీ ఆయన ఆహ్వానించలేదు. తనే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించేవారు. ఒక సందర్భంగా తమిళిసై గవర్నర్‌గా ఉన్నప్పుడు సమాచార కమిషనర్ నియామకాన్ని తొక్కి పెట్టారు.
రేవంత్‌ను ఇరికించేందుకే!
ఇక, కేసీఆర్.. తాజాగా సమాచార కమిషనర్ ఎంపిక సమావేశానికి హాజరు కాకపోవడం వెనుక రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టే యోచన ఉందన్న సందేహాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడు ఈ సమావేశానికి హాజరు కావాలి. ఆయనకు లేదా ఆమెకు కుదరకపోతే.. మరోరోజును నిర్ణయించుకుని సమావేశం అవ్వాలి. అయితే.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి తగ్గలేదు. అలాగని కేసీఆర్ కూడా రాలేదు. ఈ కారణాన్ని చూపుతూ.. రేపు కేసీఆర్ రేవంత్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపణలు గుప్పించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.