వెంటిలేటర్ పై మాజీ మంత్రి కావూరి.. అత్యంత విషమంగా ఆరోగ్యం
కేంద్ర మాజీ, సీనియర్ నేత కావూరి సాంబశివరావు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.
By: Tupaki Political Desk | 10 March 2026 10:27 AM ISTకేంద్ర మాజీ, సీనియర్ నేత కావూరి సాంబశివరావు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన ఆయనను హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అత్యావసర వైద్యం చేసిన వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కావూరి వయసు 82 ఏళ్లు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కావూరి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన సన్నిహితులు, అభిమానులు ఆశిస్తున్నారు. వ్యాపార, రాజకీయ రంగాల్లో విశేష అనుభవం గడించిన కావూరి రాష్ట్ర విభజన నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 5 సార్లు గెలిచిన ఆయన ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న పెదపారుపూడి మండలం దోసపాడు అనే గ్రామం కావూరి సాంబశివరావు స్వస్థలం. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన 82 సంవత్సరాలు. 2013లో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి సాంబశివరావు 2014లో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే 2014 తర్వాత వృద్ధాప్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
1984లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి కావూరి సాంబశివరావు తొలిసారిగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1998లోనూ అదే నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 2004లో ఏలూరు నియోజకవర్గానికి మారిన కావూరి వరుసగా రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 2013లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2014లో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన వారసులు ఎవరూ ఈ నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ, కావూరి మనవడు శ్రీభరత్ ప్రస్తుతం విశాఖ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సోమవారం మీడియా సర్కిల్స్ లో కావూరి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరిగింది. సమాచార లోపం కారణంగా ఆయన పరిస్థితిపై గందరగోళానికి గురిచేసేలా ప్రచారం జరిగిందని అంటున్నారు. ఈ ప్రచారంపై కావూరి అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమ నేతకు ఏమైందన్న ఆందోళన చెందారు. అయితే కావూరి ప్రస్తుతం అత్యావసర చికిత్స తీసుకుంటున్నారని, మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కావూరి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
