Begin typing your search above and press return to search.

కవిత బండారం బయటపడుతుందా ?

మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున కవిత ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించబోతున్నారన్న విషయం బయటపడతుంది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:10 AM GMT
కవిత బండారం బయటపడుతుందా ?
X

కల్వకుంట్ల కవిత బండారమంతా తొందరలోనే బయటపడబోతోంది. బండారం అంటే ఏదేదో ఊహించుకునేరు. ఇక్కడ విషయం ఏమిటంటే చట్టసభల్లో మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై ఆమధ్య కవిత పార్లమెంటు ముందు చాలా హడావుడి చేసిన విషయం అందరు చూసిందే. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని, కేంద్రప్రభుత్వాన్ని షేక్ చేసేస్తామంటు చాలా మాటలు చెప్పారు. వివిధ పార్టీల్లోని మహిళా ఎంపీలు, నేతలతో కలిసి పార్లమెంటు ప్రాంగణంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు.

సీన్ కట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో అసెంబ్టీ టికెట్లను కేసీయార్ ప్రకటించబోతున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున కవిత ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించబోతున్నారన్న విషయం బయటపడతుంది. దేశంలోని అన్నీ పార్టీలను మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కవిత తన తండ్రి కేసీయార్ అధ్యక్షుడిగా ఉన్న బీఆర్ఎస్ లో మహిళలకు ఎన్ని టికెట్లు ఇప్పించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. దేశంలో మిగిలిన పార్టీలను మహిళలకు టికెట్లు ఇవ్వండి అని అడుగుతున్న కవిత తమ పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇవ్వబోతున్నారన్నది కీలకం కదా.

ముందు తన తండ్రితో చెప్పి 119 నియోజకవర్గాల దామాషా పద్దతిలో మహిళలకు టికెట్లు ఇప్పించగలిగితే అప్పుడు మిగిలిన పార్టీల అధ్యక్షులను మహిళల టికెట్లపై డిమాండ్ చేయచ్చు. మహిళా రిజర్వేషన్ల లెక్క 33 శాతం ప్రకారం చూస్తే 119 నియోజకవర్గాల్లో 39 టికెట్లు మహిళలకు కేసీయార్ కేటాయించాలి. 2018 ఎన్నికల్లో కేసీయార్ నలుగురికి మాత్రమే టికెట్లిచ్చారు.

పార్టీవర్గాల ప్రకారం చూస్తే కవిత మాట చెల్లుబాటయ్యే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఒకవిధంగా కేసీయార్ కు చావో రేవో అనే పరిస్ధితి. ఎందుకంటే కేసీయార్ జాతీయ రాజకీయాల పాత్ర రాబోయే ఎన్నికల్లో గెలుపోటములపైనే ఆధారపడుంది. వచ్చేఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే జాతీయ రాజకీయాల్లో కొంతవరకు మైలేజ్ దక్కుతుంది. అలాకాకుండా ఓడిపోతే మాత్రం జాతీయ రాజకీయాల్లో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడే కేసీయార్ ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ లెక్కచేయటంలేదు. మరీ పరిస్ధితుల్లో మహిళలకు టికెట్లిచ్చి కేసీయార్ ఛాన్స్ తీసుకుంటారా ?