Begin typing your search above and press return to search.

అంతలోనే అంత మార్పా? ఢిల్లీకి వెళ్లే ముందు.. వెళ్లిన తర్వాత కవిత ఇలా

కారులో ఎక్కే వరకు.. ఎక్కిన తర్వాత కూడా నమస్కారాలు చేయటం.. పలు సందర్భాల్లో పిడికిలి బిగించి.. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసేలా వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   16 March 2024 4:34 AM GMT
అంతలోనే అంత మార్పా? ఢిల్లీకి వెళ్లే ముందు.. వెళ్లిన తర్వాత కవిత ఇలా
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ తాజాగా అరెస్టు అయిన గులాబీ ఎమ్మెల్సీ కవిత దేశ రాజధానికి చేరుకున్నారు. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈడీ తంతు.. రోజంతా సాగటమే కాదు.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని విచిత్రమైన అనుభవాలు కవితకు ఎదురయ్యాయి. చివరకు అరెస్టు అయ్యారు కూడా. ఈడీ అధికారుల వెంట ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తం పన్నెండు మంది ఈడీ అధికారుల టీంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. అరెస్టు చేసే వేళలో పద్నాలుగు పేజీల కాపీని కవితకు అందించారు.

ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఈడీ అధికారులతో బయలుదేరిన క్రమంలో ఆమె యాక్టివ్ గా కనిపించారు. ఎప్పటి మాదిరి కాకుండా ఆమె చేతికి ఒక్క ఉంగరం మాత్రమే ఉండటం కనిపించింది. అయితే.. ధీమాగా ఉన్నట్లు కనిపించారు. దారిపొడుగునా పిడిలికి బిగించటం.. మరేం ఫర్లేదన్నట్లుగా ఆమె తీరు ఉంది. ఇంటి పై అంతస్తు నుంచి మెట్లు దిగే వేళలో మాత్రం తన కుమారుడిని దగ్గరకు తీసుకున్న ఆమె.. కారులోకి ఎక్కిన తర్వాత.. డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న ఆమెను కారు బయట నుంచి ఆమె భర్త అనిల్.. ఆమె తలను నిమిరి.. దగ్గరకు తీసుకోవటం కనిపించింది.

కారులో ఎక్కే వరకు.. ఎక్కిన తర్వాత కూడా నమస్కారాలు చేయటం.. పలు సందర్భాల్లో పిడికిలి బిగించి.. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసేలా వ్యవహరించారు. తనకేం కాదన్న ధీమాను వ్యక్తం చేశారు. కారు కదిలే క్రమంలో సోదరుడు కేటీఆర్.. మేన బావ హరీశ్ లు దగ్గరకు వచ్చి ఆమెకు దన్నుగా నిలిచినట్లుగా వ్యవహరించారు. నిజానికి.. ఈడీ అధికారులు కారును ఏర్పాటు చేయగా.. ఆమె తన కారులోనే ఎయిర్ పోర్టుకు వస్తానని చెప్పటంతో అందుకు అనుమతించారు. కారులో కూర్చున్న కవితను పలువురు పరామర్శించే ప్రయత్నం చేయటంతో కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో చొరవ తీసుకున్న కవిత.. కారు ముందుకు వెళ్లేలా చెప్పటం కనిపించింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులోకి వెళ్లే క్రమంలోనూ కవిత ముఖంలో ఎలాంటి ఆందోళన కలిపించలేదు. కట్ చేస్తే.. శుక్రవారం అర్థరాత్రి వేళకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల కారులో ప్రయాణించిన ఆమె.. మధ్య సీట్లో ఇద్దరు ఈడీ అధికారుల మధ్యలో కూర్చున్నారు. ప్రయాణ బడలిక వల్లనో.. మరే ఇతర కారణాల వల్లనో కానీ ఆమె గంభీరంగా ఉండటం కనిపించింది. ముఖంలో హైదరాబాద్ లో కనిపించిన ధీమా కనిపించలేదు. అధికారులు ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్లుగా కొన్ని వీడియోల్లో కనిపించటం.. అందుకు ప్రతిగా ఆమె మౌనంగా ఉండటం కనిపించింది. మొత్తంగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు కవిత ముఖంలో కనిపించిన ఆత్మవిశ్వాసం.. ఢిల్లీ ఈడీ కార్యాలయానికి చేరుకునే నాటికి మాత్రం మాయమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.