Begin typing your search above and press return to search.

పరువు తీసుకునే పిలుపులు అవసరమా కవితక్కా?

అన్న ప్రశ్నను తమను తాము ప్రశ్నించుకుంటే.. చాలా సందర్భాల్లో నోటి నుంచి మాటలు రావు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని చెప్పాలి.

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:30 AM GMT
పరువు తీసుకునే పిలుపులు అవసరమా కవితక్కా?
X

నేతల మాటలు నీటి మూటలుగా అభివర్ణిస్తుంటారు కొందరు. అందుకు తగ్గట్లే ఉంటాయి వారినోటి నుంచి వచ్చే కొన్ని హామీలు. రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చే హామీల్ని టైం పెట్టుకొని మరీ గుర్తు చేసే వారు.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం? అప్పుడు కూడా టైం అంటే టైం అన్నట్లుగా వ్యవహరించామా? అన్న ప్రశ్నను తమను తాము ప్రశ్నించుకుంటే.. చాలా సందర్భాల్లో నోటి నుంచి మాటలు రావు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని చెప్పాలి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని సంచలన వ్యాఖ్య చేశారు కవిత. కాంగ్రెస్ తన ఎన్నికల హామీగా ఇచ్చిన 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లుల్ని కట్టాల్సిన అవసరం లేదన్న మాటను ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు వచ్చాయి. వాటిని చదివిన తర్వాత.. మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇంతకూ కవిత ఏమన్నారన్నది చూస్తే..

- సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. రెండు మూడు సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షలమందికి పింఛన్లు అందుతున్నాయి. వారికి ఎలాంటి అప్లికేషన్ లేకుండానే రూ.2వేల ఫించన్ ను రూ.4వేలకు పెంచే అవకాశం ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి?

- ఇప్పటికే రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని సీఎం చెప్పటం విడ్డూరంగా ఉంది. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలు వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి.

- రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోఎందుకు వేయలేదని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.

- రూ.4వేలు నిరుద్యోగభ్రతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించటం లేదు?

ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన కవిత తాము అధికారంలో ఉన్న పదేళ్ల గురించి మర్చిపోయినట్లున్నారు. నిరుద్యోగ భ్రతి ఇస్తామని నాటి టీఆర్ఎస్.. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా నిరుద్యోగ భ్రతి ఇవ్వలేదన్నది మర్చిపోకూడదు. పదేళ్లు పవర్ లో ఉండి చేయలేని పనిని.. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన 20రోజుల్లోనే అన్నీ జరిగిపోవాలని డిమాండ్ చేయటమా? అన్నది ప్రశ్న.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికి జరిగిపోయిన 20 రోజుల్ని తీసేస్తే.. ఇంకా 80 రోజుల గడువు ఉంది. ఆ విషయాన్ని వదిలేసి.. ప్రజలకు అలా చేయండి.. ఇలా చేయండి అని పిలుపు ఇచ్చే ముందే.. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో తమ ప్రధాన హామీల్లో ముఖ్యమైన నియామకాల గురించి ఎందుకు పట్టలేదు? అన్నది ఒక ప్రశ్న. అంతేకాదు.. కేజీ నుంచి పీజీకి ఉచిత విద్య అంటూ ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదు? అన్నది మరోప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతే.. పదేళ్ల పాలన తర్వాత కూడా పలు హామీలు అమలు చేయనప్పుడు.. రేవంత్ సర్కారు మాత్రం రాత్రికి రాత్రే అన్ని పనులు పూర్తిచేయాలనుకోవటం న్యాయమా? అన్నది ప్రశ్న. అయినా.. రేవంత్ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదు కదా? అన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఎందుకు మర్చిపోతున్నట్లు?