Begin typing your search above and press return to search.

కష్టాల్లోని ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల మద్దతేది?

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్ల దగ్గర ఆగిపోయి అధికారానికి దూరమైంది

By:  Tupaki Desk   |   18 March 2024 5:30 PM GMT
కష్టాల్లోని ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల మద్దతేది?
X

మొన్నటికి మొన్న పార్టీ శ్రేణులకు ఆమె అక్క.. నిన్నటికి నిన్న ఆమె ఏం చెబితే అది వారికి శిరోధార్యం.. కానీ, ఇప్పుడామె వ్యక్తిగతంగా కష్టాల్లో ఉంటే వారెవరూ కనిపించరేం.. కనీసం అండగా నిలిచే ప్రయత్నం కూడా చేయరేం.??

అత్యధిక ఎమ్మెల్యేలు ఇక్కడే..

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్ల దగ్గర ఆగిపోయి అధికారానికి దూరమైంది. ఈ సీట్లలోనూ అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ లో గెలుచుకున్నవే. మరికాస్త రూరల్ ఏరియాపైనా గట్టి ఫోకస్ పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది.

అండగా రారేమిటి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై రెండేళ్లుగా ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోయిన మూడున్నర నెలలకు గత శుక్రవారం ఆమెను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకంగా ఢిల్లీకి తీసుకెళ్లారు. మరోవైపు కవిత అరెస్టు సందర్భంగా ఈడీ అధికారులతో ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, బావ, మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఇక మరుసటి రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చినట్లు కథనాలు వచ్చాయి. కానీ, శనివారం ఆ ప్రభావం కనిపించనేలేదు.

ఒక్కరూ ఉద్యమించలేరా?

అన్నిటికిమించి బీఆర్ఎస్ కు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ లోనూ స్పందన కరువైంది. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధినేత కుమార్తెకు అండగా నిలిచే ప్రయత్నం చేయలేదా? అనిపించింది. ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఉప్పల్ ఇలా నగరం అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అయినా కవిత అరెస్టు అక్రమం అంటూ వీరిలో ఒక్కరూ పార్టీ శ్రేణులతో కలిసి ఉద్యమించలేదు. ఈ పరిస్థితిని నిశితంగా గమనించిన రాజకీయ విశ్లేషకులు ఇంతలోనే ఇంత మార్పా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.