Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్ లో ఏముంది?

ఇదిలా ఉంటే.. తాజాగా తమ కస్టడీలోకి కవితను తీసుకోవటానికి ఈడీ న్యాయస్థానానికి ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. అందులో పలు సంచలన అంశాల్ని ప్రస్తావించింది.

By:  Tupaki Desk   |   17 March 2024 5:42 AM GMT
ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్ లో ఏముంది?
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కేసులో తాజాగా అరెస్టు అయిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయటం.. ఢిల్లీకి తరలించటం తెలిసిందే. తాజాగా ఆమెను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఓకే చెప్పింది. దీంతో.. ఏడు రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తమ కస్టడీలోకి కవితను తీసుకోవటానికి ఈడీ న్యాయస్థానానికి ఒక పిటిషన్ ను దాఖలు చేసింది. అందులో పలు సంచలన అంశాల్ని ప్రస్తావించింది.

కవితను ఢిల్లీ మద్యం కేసులో కింగ్ పిన్ గా ఈడీ పేర్కొనటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ ఉదంతంలో ఆప్ నేతలకు రూ.100కోట్ల లంచం ఇవ్వటమే కాదు రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లుగా ఈడీ వెల్లడించింది. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన కవిత కస్టడీ పిటిషన్ లో పలు అంశాలు ఉన్నాయి. వీటిని చూస్తే.. ఈడీ అరెస్టు వెనుక అసలు లెక్కలు ఇట్టే అర్థమయ్యేలా ఉన్నాయంటున్నారు.

ఇంతకూ కవిత కస్టడీ పిటిషన్ లో ఈడీ ఏమేం చెప్పిందన్నది చూస్తే..

- డిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో ఎమ్మెల్సీ కవిత ఒకరు. కీలక లబ్ధిదారు. ఆమే కింగ్ పిన్.

- ఈ ఉదంతంలో ఆమ్ ఆద్మీ నేతలకు రూ.100కోట్ల లంచం ఇచ్చారు. రూ.192.8 కోట్ల మొత్తాన్ని కవిత అక్రమంగా ఆర్జించారు. ఆమెను కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది.

- సౌత్ గ్రూప్ నకు చెందిన కవిత.. శరత్ రెడ్డి.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. రాఘవ తదితరులు ఆమ్ఆద్మీ నేతలతోకలిసి కుట్ర పన్నారు.

- మద్యం పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆమ్ ఆద్మీ నేతలకు రూ.100కోట్లు సమర్పించారు. ఈ కారణంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాలతో కలిసి కవిత టీం ఒప్పందం కుదుర్చుకుంది.

- కవిత బినామీ అరుణ్ రామచంద్రపిళ్లైకి ఇండో స్పిరిట్ లో ఎలాంటి పెట్టుబడి లేకున్నా.. పార్టనర్ షిప్ తో పాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్ రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కింది. ఈ కారణంగా 2021- 22 ఢిల్లీ మద్యం పాలసీలో ఎల్1గా నిలిచిన ఇండో స్పిరిట్ కు అత్యధిక లాభాలు దక్కాయి.

- లిక్కర్ పాలసీలో కవిత టీంకు అనుకూల విధానాల్ని రూపకల్పన చేసిన కుట్రకు 2021 మార్చి 19న కేజ్రీవాల్.. మనీశ్ సిసోదియా ప్రతినిధి విజయ్ నాయర్ హైదరాబాద్ టూర్ కు లింకుంది. ఆ తర్వాతి రోజున హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ లో వాట్సాప్ ఛాటింగ్ విశ్లేషణలో ఈ కుట్ర వెలుగు చూసింది.

- మార్చి 15-19 మధ్య ఢల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్.. స్టెనో సునీల్ సింఘాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు భిన్నంగా విజయ్ నాయరర్ హైదరాబాద్ లో కవితను కలిసి వెళ్లిన తర్వాత మార్చి 22న మద్యం విధానం రిపోర్టుకు తుది రూపం ఇచ్చినట్లుగా గుర్తించాం.

- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అండ్ కో చేసిన ప్లానింగ్ ద్వారా లిక్కర్ పాలసీలో మార్జిన్ మనీని 12శాతానికి పెంచారు. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు.

- లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేశారు.

- ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారు.

- అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌ కోసం కవిత తనను సంప్రదించారని.. కేజ్రీవాల్ తనతో చెప్పారని మాగుంట మాకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ లో వెల్లడించారు.

- కవిత టీం లిక్కర్ బిజినెస్‌లో రావాలని చూస్తున్నారు. ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు మాకు మాగుంట చెప్పారు.

- హైదరాబాద్‌లో కవితతో జరిగిన భేటీలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వాలి. వెంటనే రూ.50 కోట్లు చేరవేయాలని తమకు కవిత చెప్పినట్లుగా మాగుంట తన స్టేట్‌మెంట్‌‌లో వెల్లడించారు.

- ఈ ఉదంతంలో మరో ముద్దాయి రాఘవను విచారించారు. ఆ సందర్భంలో ఆయన.. ‘‘కవిత సూచనతో రూ.25 కోట్లు’’ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.25 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో ఇచ్చినట్టు మాగుంట రాఘవ మాకు చెప్పారు.

- రెండు పెద్ద సంచుల్లో డబ్బును దినేశ్ ఆరోరా ఆఫీసు నుంచి తీసుకెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లుగా కవిత వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంలో అభిషేక్ బోయినపల్లి సూచనలు ఇచ్చారు.

- మరో సందర్భంలో ఢిల్లీ నారాయణ తోడాపూర్ సమీపంలోని అడ్రెస్ కు రెండు సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అప్పగించినట్లుగా కవిత వ్యక్తిగత సిబ్బంది వెల్లడిచారని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.

- కవితను విచారించిన వేళలో ఇండో స్పిరిట్‌లో వాటా గురించి ప్రశ్నిస్తే ఖండించారు. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్‌లో కవితకు 33% వాటా ఉన్నట్లుగా ఉంది.

- మొబైల్ ఫోన్స్ విషయంలోనూ కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో ప్రత్యేకించి అడిగిన ప్రశ్నలకు అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారు. సాక్షాలను కూడా కవిత ధ్వంసం చేశారు. కవిత ఇచ్చిన మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తే.. పది ఫోన్లలో కనీసం నాలుగు ఫోన్లను ఈడీ సమన్లు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారు. విచారణలోనూ అసంబంద్ధ సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశాం.

- మద్యం పాలసీలో హోల్ సేలర్లకు లాభాల వాటాను 12 శాతానికి పెంచటం ద్వారా సౌత్ గ్రూప్ నకు లబ్థి చేకూరింది. వాటి నుంచే ఆప్ నేతలకు నిధులు అందే కుట్ర జరిగింది. ఆ డబ్బును గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపినట్లుగా మా దర్యాప్తులో తేలింది. కవిత మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా నిర్ధారణ అయ్యింది. అందుకే అరెస్టు చేశాం.