వాట్ చారీ.. వాళ్లు బీఆర్ఎస్.. మాది టీఆర్ఎస్.. జర్నలిస్ట్ పై కవిత సెటైర్
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
By: A.N.Kumar | 3 May 2026 4:00 AM ISTతెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ మీకు పోటీనా? అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆమె చేసిన “వాట్ చారీ.. వాళ్లు బీఆర్ఎస్.. మాది టీఆర్ఎస్” అన్న సెటైర్ రాజకీయంగా ఆసక్తికర సందేశాన్ని ఇచ్చింది. పార్టీ పేర్ల చుట్టూ జరిగిన ఈ చర్చలో కవిత తన వ్యూహాత్మక ధోరణిని వెల్లడించారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కవిత తమ పార్టీ పాంచజన్యంలో పేర్కొన్న హామీలపై గట్టిగా నిలబడ్డారు. విద్య, వైద్యం ఉచితంగా అందించకపోతే ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిందేనని, తాము ఇచ్చిన మాట తప్పితే తాన్నే ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. ఇది కేవలం రాజకీయ నినాదం కాకుండా బాధ్యతాయుత పాలనపై తమ నిబద్ధతగా వివరించారు.
తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై చేసిన విమర్శలపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. అవి వ్యక్తిగతం కాదని, పూర్తిగా రాజకీయ పరమైనవేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేయాల్సిన అభివృద్ధి పనుల్లో లోపాలు జరిగాయని, ముఖ్యంగా నీటి వనరుల వినియోగం, ఉద్యోగాల కల్పనలో తప్పిదాలు జరిగాయని విమర్శించారు.
అలాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కూడా కవిత విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మేలు చేయకుండా విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తెచ్చే దిశగా ప్రయత్నించాలన్నారు. తమ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మహిళా శక్తిపై విశ్వాసం వ్యక్తం చేసిన కవిత , తమ పార్టీలో 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. పురుషుల కంటే సమర్థవంతంగా పార్టీని నడిపించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “సర్వోదయ తెలంగాణ” లక్ష్యంగా ముందుకు సాగుతామని, ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తంగా చూస్తే కవిత వ్యాఖ్యలు కేవలం సెటైర్‌తో పరిమితం కాకుండా కొత్త రాజకీయ దిశను సూచిస్తున్నాయి. పార్టీ పేరు నుంచి విధానాల వరకు ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఆమె నాంది పలుకుతున్నట్లు కనిపిస్తోంది.
