కల్వకుంట్ల కవిత కాదు.. కాంగ్రెస్ కవిత నా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ ను వీడాక ఆమె ఏ పార్టీలోచేరుతారన్న చర్చ విసృతంగా సాగింది.
By: Tupaki Desk | 28 Nov 2025 3:00 PM ISTతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ ను వీడాక ఆమె ఏ పార్టీలోచేరుతారన్న చర్చ విసృతంగా సాగింది. కేటీఆర్, హరీష్ రావుపై ఆరోపణలు చూశాక ఆమె బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్నట్టే కనిపించింది. మరి ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు వెళతాయన్న చర్చకు తాజాగా ఆమె కట్టుకున్న చీర హింట్ ఇచ్చినట్టైంది.
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు తెరపడడం లేదు. అయితే తాజాగా ఒక నిశ్చితార్థ వేడుకలో ఆమె ధరించిన చీర సరికొత్త రాజకీయ చర్చకు దారి తీసింది.
* కాంగ్రెస్ జెండాను పోలిన 'త్రివర్ణ' చీర!
కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కవిత... అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకు కారణం ఆమె ధరించిన చీర రంగులే. ఆమె కట్టుకున్న చీరకాంగ్రెస్ జెండాను పోలిన మూడు రంగులను కలిగి ఉందని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు వెంటనే గుర్తించారు. అంతే ఈ 'త్రివర్ణ' చీర ధారణపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
* కాంగ్రెస్‌లో చేరికకు సంకేతమా?
ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని మరోసారి ప్రచారం జోరుగా సాగుతోంది. భట్టి విక్రమార్క ఇంట్లో.. కాంగ్రెస్ జెండాను గుర్తు చేసే రంగుల చీరతో వెళ్లడం... కవిత కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి పరోక్ష సంకేతంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బీజేపీతో కవితకు గల వైరం నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరడం ద్వారా.. తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా పొందాలని ఆమె భావిస్తున్నారేమోనని చర్చించుకుంటున్నారు.
గతంలోనూ ఇలాంటి ప్రచారాలు... ఖండించిన కవిత!
నిజానికి కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఏ పార్టీలో చేరనున్నారు అనే ఊహాగానాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు, ఆమె వాటిని బలంగా ఖండించారు. అయితే ఈసారి త్రివర్ణ చీర అంశం చర్చకు రావడంతో కవిత మళ్లీ స్పందించే అవకాశం ఉంది.
ఓవరాల్ గా చూస్తే.. అటు బీఆర్ఎస్ దారులు మూసుకుపోయి.. ఇటు బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. సొంతంగా రాజకీయంగా ఎదగడం ఈ కాలంలో కవితకు కష్టం. ఇప్పటికే షర్మిల అలా ఎదగలేక కాంగ్రెస్ లో చేరిపోయారు. అందుకే కవిత కూడా తన అడుగులు కాంగ్రెస్ వైపు మళ్లిస్తోందని రాజకీయ విశ్లేషఖులు అంటున్నారు.
