జయమ్మ స్ట్రాటజీ.. కవితక్కకు సూటయ్యేనా?!
తన మనసులో మాట.. అంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రారంభించిన కవిత కీలక ప్రకటన చేశారు.
By: Garuda Media | 25 April 2026 9:00 PM ISTతన మనసులో మాట.. అంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రారంభించిన కవిత కీలక ప్రకటన చేశారు. అదే `తెలంగాణ తల్లి`గా తాను ఉండాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సహజంగా ఇది తమిళనాడులో మాత్రమే చెల్లింది. అక్కడ ఉమ్మడి పార్టీ అంటే ద్రవిడ పార్టీ నుంచి అన్న డీఎంకే విడిపోయినప్పుడు.. ఎంజీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత(జయమ్మ) తనకంటూ ఒక సొంత కుంపటిని ఏర్పాటు చేసుకునే క్రమంలో తమిళ ప్రజలకు తల్లిగా పరిచయమయ్యారు.
ఇలాగే ఆవిడ కూడా తనను తల్లిగా భావించాలని కోరుకున్నారు. తమిళనాడు ప్రజలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే.. ఆవిడ నటిగా తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. అప్పటికే వందలాది సినిమాల్లో ఆమె నటించారు. తమిళ ప్రజలను ఆకట్టుకున్నారు. కాబట్టి ఆమెను తల్లిగా భావించారు. అది సక్సెస్ అయింది. ఇప్పటికీ జయలలిత విగ్రహాలతో ఆలయాలు కట్టిన గ్రామాలు కూడా ఉన్నాయి తమిళనాడులో.
కానీ ఆ పరిస్థితి కవితకు వస్తుందా.. ఆమె కామె అనుకుంటే తల్లిగా రిసీవ్ అవుతారా.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ సమాజం ఒక విభిన్నమైన ఆలోచనతో ఉంటుంది. సెంటిమెంటు అంటే అది వ్యక్తిగత సెంటిమెంటు కంటే కూడా సమాజ సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఒక ఘటనను తీసుకుంటే.. కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు.
ఇంతలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో ఆయన దీక్ష విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇంక తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ దీక్షను కొనసాగించారు. అటువంటి సెంటిమెంటు ఉన్న తెలంగాణలో `నేను అమ్మ`ని అని పరిచయం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం ఏ మేరకు దీన్ని ఆహ్వానిస్తుంది అనేది ప్రశ్న.
ఇప్పటివరకు కవిత అంటే కెసిఆర్ కుమార్తె గానే చూశారు. ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా ఒక రాజకీయ నాయకురాలుగా ఒక జాగృతి అధ్యక్షురాలుగా చూశారే తప్ప అకస్మాత్తుగా `నేను అమ్మ`ని అని ఆవిడ చెప్పినంత మాత్రాన తెలంగాణ సమాజం ఆ రకంగా రిసీవ్ చేసుకోవడం కష్ట సాధ్యం. అంతేకాదు ఆవిడ చెప్పినంత తేలికగా తెలంగాణ సమాజం కవితను అమ్మగా చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎవరికి ఉండే అంచనాలు వారికి ఉంటాయి తప్పేమీ కాదు. కానీ.. ఎక్కువగా ఊహించుకుంటేనే ప్రమాదం. ఈ విషయంలో కవిత ఆలోచించుకుని అడుగులు వేయడం ఉత్తమమని పరిశీలకులు చెబుతున్నారు.
