కవిత వర్సెస్ మల్లన్న: బీఆర్ఎస్- కాంగ్రెస్ మౌనం.. ఏం జరుగుతుంది?
తెలంగాణలో ఆదివారం ఉన్నట్టుండి మబ్బలు లేని వాన మాదిరిగా.. చోటు చేసుకున్న ఘర్షణ, అనంతరం గాలిలోకి కాల్పుల ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
By: Tupaki Desk | 14 July 2025 9:34 AM ISTతెలంగాణలో ఆదివారం ఉన్నట్టుండి మబ్బలు లేని వాన మాదిరిగా.. చోటు చేసుకున్న ఘర్షణ, అనంతరం గాలిలోకి కాల్పుల ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పై తీన్మార్ మల్లన్న చేసిన.. 'మంచం పొత్తా-కంచం పొత్తా' వ్యాఖ్యలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. బీసీల కు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంపై కవిత చేసిన వ్యాఖ్యలకు.. మల్లన్న కౌంటర్ ఇచ్చా రు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే వ్యవహారం కాంగ్రెస్‌దేనని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆయన.. ''అసలు నీకేం సంబంధం?. బీసీలకు రిజర్వేషన్లు.. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. బీసీలతో నీకేమన్నా.. మంచం పొత్తుందా.. కంచం పొత్తుందా?'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కవిత సీరియస్ అయ్యారు. మల్లన్న హద్దులు దాటారంటూ.. ఆమె డీజీపీకి, మండలి చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలన్నారు. ఇక, దీనికి కౌంటర్‌గా కవిత మండలి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని తాము కూడా డిమాండ్ చేస్తామంటూ .. మల్లన్న వ్యాఖ్యానించారు.
ఇలా.. ఇరువురు నాయకులు కూడా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఇరు పక్షాలకు చెందిన పార్టీలు మాత్రం గంటలు గడిచినా.. దాడులు జరిగి దుమారం రేగినా ఈ వ్యవహా రంపై స్పందించలేదు. తీన్మార్ మల్లన్న వ్యవహారానికి వస్తే.. ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు.. నేరుగా సంధించిన సూటి పోటి మాటలతో గత కొన్నాళ్లుగా పార్టీ ఆయనను పక్కన పెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా.. ఆయన విషయంలో సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా వివాదంపై కూడా అందరూ మౌనంగా ఉన్నారు.
ఇక, కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమెను కూడా బీఆర్ ఎస్ అధినాయకత్వం దాదాపు పక్కన పెట్టింది. ఆమె గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ స్పందించడం లేదు. అంతర్గత కుమ్ములాటలతోపాటు.. కేటీఆర్‌ను తోసిరాజని కవిత చేస్తున్న దూకుడు వ్యవహారంతో పార్టీలో ఆమె గురించి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఇంత హంగామా జరిగినప్పటికీ.. బీఆర్ఎస్‌కు బద్ధ శత్రువుగా భావించే తీన్మార్ మల్లన్న కవితపై వ్యాఖ్యలు చేసినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. సో.. ఇక, మిగిలింది.. న్యాయపోరాటమో లేక.. వ్యక్తిగత పోరాటమో తప్ప.. ఇరువురి ముందు మరోమార్గం లేదని అంటున్నారు పరిశీలకులు.
