Begin typing your search above and press return to search.

మా డబ్బుతోనే మీ కార్లు, భూములు.. పవన్ పై మరోసారి కవిత ఫైర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ చీఫ్ కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ ప్రకటించినప్పటి నుంచి కవిత ఆయనను టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   6 Jun 2026 3:06 PM IST
మా డబ్బుతోనే మీ కార్లు, భూములు.. పవన్ పై మరోసారి కవిత ఫైర్
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ చీఫ్ కవిత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ ప్రకటించినప్పటి నుంచి కవిత ఆయనను టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత సొంతంగా పట్టు సాధించాలనే వ్యూహాంతో పవన్ ను టార్గెట్ గా ఎంచుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. దీంతో తెలంగాణకు చెందిన ఇతర పార్టీలు, నాయకులు కంటే దూకుడుగా కవిత విమర్శలు ఉంటున్నాయని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా రోజుకొక అంశాన్ని ఎంచుకుంటూ వాగ్బాణాలు సంధిస్తున్న కవిత తాజాగా వివాదాస్పదమైన శిఖం భూములపై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ లో పవన్ కొన్న పది ఎకరాల భూములూ శిఖం భూమేనని కవిత ఆరోపించారు. ఆ భూములను తక్షణం ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. గద్దర్ కు కారు కొని ఇచ్చానని పవన్ చెప్పి, ఆయనను తీవ్రంగా అవమానించారని ఆక్షేపించారు. తెలంగాణ వాదం అంటే ఉగ్రవాదమని పవన్ అంటున్నారని ఆరోపించారు. గద్దర్ కు కారు కొనిచ్చానని చెప్పి ఒక కళాకారుడిని అవమానించారని, ఒక వైపు ప్రొఫెసర్ నాగేశ్వర్, మరో వైపు గద్దర్ వంటి వారిని అవమానిస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు.

ఇక పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన కవిత.. ఆయన ఆదాయంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని అంటారు కానీ, పవన్ గద్దర్ కు కారు కొనిచ్చారో లేదో కానీ డప్పాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. గద్దర్ కు కారు కొనిచ్చినా, మీరు తిరుగుతున్న కార్లు అయినా మా డబ్బులతో కొన్నవే అంటూ విమర్శించారు. మీ సినిమాలను ఎక్కువగా నైజాం వారే చూస్తారు. మీ సినిమాలకు ఎక్కువ ఆదాయం మా ప్రాంతం నుంచే వస్తుంది అంటూ కవిత ఉదహరించారు.

మా తెలంగాణ బిడ్డలు చూడటంతోనే మీ సినిమాలకు హైయస్ట్ ఆదాయం వస్తుంది. అంటే మీ కొనుక్కున్న కారులు, భూములు మా బిడ్డల డబ్బుతోనే అంటూ కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ ఫోక్ సాంగులను కాపీ కొట్టి మీ సినిమాల్లో పెట్టుకున్నారు, వాటికి రాయల్టీ ఎప్పుడైనా ఇచ్చారా? అంటూ కవిత ప్రశ్నించారు. మొత్తానికి కవిత తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ టార్గెట్ గా ఆమె ప్రత్యేక వ్యూహంతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో తన ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్న కవిత.. జనసేనను ఒక ట్రంప్ కార్డులా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.