తెలుగు చెల్లెళ్లు కవిత.. షర్మిల.. అదేంటో అన్నీ మూడక్షరాలే!
కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల తనయ వైఎస్ షర్మిలలు మాత్రం తండ్రలు వారసత్వాన్ని ఘనంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 5:13 PM ISTతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తండ్రుల వారసత్వంగా ఎదిగిన కుమారులు ఉన్నారు కానీ.. కుమార్తెలు చాలా తక్కువ. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల తనయ వైఎస్ షర్మిలలు మాత్రం తండ్రలు వారసత్వాన్ని ఘనంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ తండ్రులకు ముద్దుల కూతుళ్లే. ఇద్దరూ ఒకప్పుడు అన్నలకు గారాల చెల్లెళ్లే. ఇప్పుడు విభేదించడంలోనూ అదే పంథాలో వెళ్తున్నారు.
పెళ్లి అయి దశాబ్దాలు గడిచినా పుట్టింటి పేరును కొనసాగిస్తూ వస్తున్నారు షర్మిల, కవితలు. ఇక ఈ ఇద్దరి విషయంలో మరో సారూప్యత మూడు అక్షరాలు. అది.. ఒకటీ రెండు అంశాల్లో కాదు.. పలు అంశాల్లో కావడం గమనార్హం.
కల్వకుంట్ల కవిత.. పేరులో మూడు అక్షరాలు ఉండగా.. వైఎస్ షర్మిల పేరులోనూ అంతే. ఇద్దరి భర్తల పేర్లు కూడా ఒకటే.. అదీ ఒకే పేరునూ. షర్మిల భర్త పేరు అనిల్, కవిత భర్త పేరు కూడా అనిల్ కావడం గమనించదగ్గ విషయం. కవిత తండ్రి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే షార్ట్ కట్ లో కేసీఆర్ అని పిలుచుకుంటారు. షర్మిల నాన్న పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాగా.. వైఎస్సార్ అని వ్యవహరించేవారు. ఈ ఇద్దరి పేరులోనూ శేఖర్ ఉండడం మరో విషయం. కవిత అన్న కల్వకుంట్ల తారక రామారావును కేటీఆర్ ను సంబోధిస్తుండగా.. షర్మిల సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్ అని పిలుస్తుంటారు.
ఈ పోలికల సంగతి పక్కనపెడితే షర్మిల, కవిత ఇద్దరూ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. తొలుత అన్నల బాటలోనే ఉన్నా.. ఇప్పుడు వారినే విభేదిస్తున్నారు. అన్న వైఎస్ జగన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు షర్మిల అడుగు బయటపెట్టి పాదయాత్ర చేశారు. తర్వాతి కాలంలో తీవ్రంగా విభేదించారు. సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ)ని స్థాపించారు. కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
కవిత 20 ఏళ్ల కిందట తెలంగాణ జాగృతిని స్థాపించారు. ఉద్యమ సమయంలో ఆ సంస్థ పేరిట తెలంగాణ కల్చర్ వ్యాప్తికి తనవంతు ప్రయత్నాలు సాగించారు. తాజాగా జాగృతి సొంత కార్యాలయాన్ని తెరిచారు.కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. షర్మిలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు...ఇదీ ఇద్దరు తెలుగు నాయకురాళ్ల విషయంలో సారూప్యత.
