అమెరికాలో కవిత.. తెలంగాణలో ఆమె పొలిటికల్ కెరీర్ కు అడ్డు గీత
నాలుగు నెలల కిందట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉన్న సమయంలో తెలంగాణలో కలకలం రేగింది.
By: Tupaki Desk | 21 Aug 2025 1:33 PM ISTనాలుగు నెలల కిందట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉన్న సమయంలో తెలంగాణలో కలకలం రేగింది. ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం కావడం దుమారం రేపింది. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలపై కవిత లేఖలో చెప్పిన విషయాలు ప్రత్యర్థులకు అస్త్రాలుగానూ మారాయి. తద్వారా తండ్రి కేసీఆర్ కు ఆమెను దూరం చేశాయి. కవిత మళ్లీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వచ్చే నెల మొదటివారంలో తిరిగి రానున్నారు. ఇంతలోనే బీఆర్ఎస్ లో ఆమె స్థానం ప్రశ్నార్థకం చేసేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సింగరేణి నుంచి బయటకు...
తెలంగాణలోని ప్రధాన కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (తెబొగకాసం). బీఆర్ఎస్ కు అనుబంధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందీ సంఘం. అలాంటి సంఘానికి కవిత సరిగ్గా 2015 ఆగస్టు 17న గౌరవ అధ్యక్షురాలు అయ్యారు. తాజాగా ఆమెను పదవి నుంచి తప్పించింది బీఆర్ఎస్ నాయకత్వం. కవిత స్థానంలో మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. దీంతో కవితకు పార్టీతో ఉన్న అనుబంధం మరింత బీటలువారినట్లయింది. ఈ నేపథ్యంలో... అప్పట్లో పార్టీ పరిణామాలపై లేఖ రాసి అమెరికా వెళ్లిన కవిత.. ఇప్పుడు అమెరికా నుంచే లేఖ విడుదల చేశారు. తెబొగకాసం కార్మికులను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ఉన్న అంశాలు..
పదేళ్ల పాటు గౌరవాధ్యక్షురాలిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీలో ఒకరిగా సేవలు చేశాను. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నన్ను తొలగించి కొప్పుల ఈశ్వర్ ను తెబొగకాసం గౌరవ అధ్యక్షుడిగా నియమించారు. అయితే, కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇది సాంకేతికంగా తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే కేవలం రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. వీటితో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటాయి. పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై లేఖ రాస్తే.. నేను అమెరికా పర్యటనలో ఉండగా దానిని లీక్ చేశారు. ఇలా నాపై కుట్రలకు పాల్పడుతున్నది ఎవరో బయట పెట్టాలని కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టు కొందరు నాపై కక్షగట్టారు. లీకు కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. వారే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా తెబొగకాసం సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
కవితకు హెచ్చరికేనా..?
కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత కవిత ఆయనను కలిసేందుకు రెండుసార్లు ఫాంహౌస్ కు వెళ్లారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తుండగా ఒకసారి, రెండో కుమారుడిని అమెరికాలో చదివించేందుకు వెళ్తూ ఆశీర్వాదం కోసం మరోసారి వెళ్లారు. కానీ, కేసీఆర్ ఆమెను కలవలేదు. ఇప్పుడు ఏకంగా తెబొగకాసం నుంచి తప్పించారు.. మరోవైపు కవిత పార్టీకి సమాంతరంగా ఆందోళనలకు దిగుతున్నారు. చాలా విషయాల్లో పార్టీ లైన్ తో విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను క్రమంగా బీఆర్ఎస్ నుంచి దూరంపెడుతున్నారా పొమ్మనలేక పొగ పెడుతున్నారా..? అనిపిస్తోంది.
