Begin typing your search above and press return to search.

చంద్రబాబు, లోకేశ్ పై కవిత పొగడ్తలు.. పవన్ పై విమర్శలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   10 April 2025 3:50 PM IST
చంద్రబాబు, లోకేశ్ పై కవిత పొగడ్తలు.. పవన్ పై విమర్శలు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్స్ కామెంట్స్ చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కవిత చంద్రబాబు, లోకేశ్ ను పొగడ్తెలతో ముంచెత్తారు. అంతేకాకుండా బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, దివంగత బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పైనా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ఆమె విమర్శలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబు అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు పొసగదని అంటుంటారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే సందర్భం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు చంద్రబాబుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంటారు. తన రాజకీయం సాఫీగా సాగాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ భావోద్వేగాన్ని వాడుకోవాలనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతుంటారు. ఆయన రాజకీయ వారసులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మాత్రం భిన్నవైఖరి ప్రదర్శిస్తున్నారు. తండ్రిలా కేటీఆర్ కూడా చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తుంటారు. కానీ, కవిత మాత్రం ఈ సారి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

చంద్రబాబుపై ఎప్పుడూ విమర్శలు చేసే బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడరంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కర్ణాటక సీఎం కూడా తనకు ఫేవరట్ పొలిటీషియన్లుగా కవిత పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ విషయమై అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబు చెప్పారు కవిత. ఏపీ సీఎం చంద్రబాబు సిన్సియర్ అని, ఆయన ధైర్యంగా ఉంటూ ఎన్నో సవాళ్లను స్వీకరిస్తుంటారని చెప్పారు. అదేవిధంగా మంత్రి లోకేశ్ చూపే ఆప్యాయత అద్భుతమంటూ కొనియాడారు. ఆయన మెచ్చూర్డ్ లీడర్ అంటూ ప్రశంసించారు. ఇక బీజేపీలో దివంగత మహిళా నేత సుష్మ స్వరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు కవిత.

ఇలా తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు అందరిపైనా పొగడ్తలు కురిపించిన కవిత.. తన అన్న కేటీఆర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాత్రం విమర్శలు గుప్పించారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తాను ఆయనను సీరియస్ గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు స్వయం ప్రకటిత చే గువేరా అంటూ తనను తాను ఆదర్శవాదిగా చెప్పుకున్న పవన్, ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారంటూ ఆరోపించారు. పవన్ పై తనకు ఏ మాత్రం గౌరవం లేదని కవిత స్పష్టం చేశారు.