కవిత... ప్రతీ మాట మిస్ ఫైర్ !
ఇక 2014లో తెలంగాణాలో జరిగిన తొలి ఎన్నికల్లో కవితకు కేసీఅర్ నిజామాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు.
By: Tupaki Desk | 10 July 2025 7:38 PM ISTకేసీఆర్ ముద్దుల తనయగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కవిత ఈ రోజుకీ కేరాఫ్ కేసీఆర్ డాటర్ గానే అంతా చెప్పుకుంటారు. ఆమె తెలంగాణా జాగృతి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణా ఉద్యమ సమయంలో కొంత వరకూ పోరాటం చేసి ఉండొచ్చు. ఏది చేసినా బలమైన కేసీఆర్ నీడ ఆమె మీద ఉంది. ఆ అండదండలు పుష్కలంగా ఆమెకు ఉన్నాయి. అందుకే ఆమె ఆ సంస్థ తరఫున ఎంతటి పెద్ద వారిని విమర్శిచినా ఏమి చేసినా చెల్లిపోయింది అని చెబుతారు.
ఇక 2014లో తెలంగాణాలో జరిగిన తొలి ఎన్నికల్లో కవితకు కేసీఅర్ నిజామాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. ఉద్యమ వేడి ఆ మీదట జరిగిన ఎన్నికలు కావడంతో కవిత సునాయాసంగా గెలిచారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె అదే నిజామాబాద్ నుంచి రెండోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ పడి ఓటమి చవి చూసారు. ఆ తరువాత నిజామాబాద్ ని మెల్లగా బీజేపీకి అప్పగించేశారు. వరసగా రెండు సార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలవడం ద్వారా దానికి తనకు బలమైన కేంద్రంగా చేసుకున్నారు.
దాంతో కవిత రాజకీయం ఇబ్బందులో పడింది. ఇక ఆమెను ఎమ్మెల్సీ చేశారు. ఆ విధంగా రాజకీయంగా ఎంతో కొంత ఓదార్పు కానీ ఆమెకు ఎమ్మెల్యేగా చాన్స్ దక్కలేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయలేదు. ఇక ఎమ్మెల్సీగా ఉన్నా మంత్రి పదవి అయితే ఆమెను వరించలేదు. దానికి అనేక సమీకరణలు చెబుతున్నా కవిత జస్ట్ ఎమ్మెల్యేగా మారడానికి ఆమె తన శక్తిసామర్ధ్యాలను మరింతగా పెంచుకునే ప్రయత్నం ఏదీ చేయలేకపోయారు అన్న విమర్శలూ ఉన్నాయి
ఇక కేటీఆర్ మంత్రిగా ఉంటూ పార్టీలో తన స్థానాన్ని పదిలపరచుకున్నారు అంటే ఆ లెక్క వేరు. రాజకీయం అంటే మొదటి మెట్టే ఎవరైనా ఎక్కించగలరు, ఆ మీదట ఎక్కాల్సింది నిలదొక్కుకోవాల్సింది వారే. అలా కేటీఅర్ అయితే తనకు దక్కిన అవకాశాలతో ఈ రోజున కేసీఆర్ తరువాత తానే అని క్యాడర్ కి నమ్మకం కలిగించారు అని అంటారు. తండ్రి కేసీఆర్ కావచ్చు. ఆయన ఎవరిని అయినా తన తరువాత ప్రమోట్ చేయవచ్చు. కానీ క్యాడర్ నమ్మకం కూడా ఇక్కడ ముఖ్యం. అలా చూస్తే కనుక కేటీఆర్ ఆ విషయంలో ముందున్నారు అనే అంటారు.
ఈ నేపధ్యంలో కవిత బీఆర్ఎస్ లో తన వాటా కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడినపుడు చెప్పిన మాటలు ఏమిటంటే బీఆర్ఎస్ నిర్మాణంలో తానూ ఉన్నాను అని. ఇక తనకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందని కూడా వెల్లడించారు అయితే బీఆర్ఎస్ లో తన నిజమైన పాత్ర ఏమిటో ఆమె తెలుసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.
నిజంగా ఆమె రాజకీయంగా మరింత పరిపక్వతతో ఆలోచించి ఉంటే తాజాగా ఆమె ఇస్తున్న అనేక ప్రకటనలు చేసి ఉండరని అంటున్నారు. ఆమె రాజకీయంగా తన స్థాయిని తానే తగ్గించుకునేలా ఆమె ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. తన తండ్రి కేసీఆర్ ఆమె రాశారు దానిని ఆమె చెప్పినట్లుగానే ఎవరో లీక్ చేసి మీడియాకు వదిలారు అనుకుంటే అపుడు ఆమె రియాక్షన్ మరీ ఇంత పేలవంగా ఉండకూడదు కదా అని అంటున్నారు
ఎస్ నేనే ఆ లేఖ రాశాను అని ఆమె చెప్పారు. అది ఆమె నిజాయతీగా చెప్పాను అని భావించవచ్చు. కానీ రాజకీయంగా చూస్తే వ్యూహాత్మకంగా తప్పు చేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే తన అన్న కేటీఆర్ తో గ్యాప్ ఉందని ఆమె మీడియా ముందు చెప్పడమూ మిస్ ఫైర్ అయింది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో తానూ ఉన్నాను అంటూ కేసీఆర్ తో రాసిన లేఖ బాహాటం కావడంతో ఒక రచ్చ జరిగితే అన్నతో విభేదాలు అంటూ ఆమె మరింతగా దూరం జరిగారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కవిత జస్ట్ ఎమెల్సీ మాత్రమే. అది నామినేటెడ్ పదవి అంటే రాజకీయంగా చూస్తే ఆమె ఒకే ఒక్కసారి ఎన్నికల్లో గెలిచారు. పార్టీ పరంగా కూడా పెద్ద పదవులలో లేరు. అలాంటిది ఆమె తాను సీఎం అయి తీరుతాను ఏదో నాటికి అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా బూమరాంగ్ అయింది అని అంటున్నారు ఇంత కాలం ఆమె నిజంగా పార్టీలో మంచి చెడుల మీద మాట్లాడారు అనుకున్న వారికి అలా కాదు పీఠం కోసమే అన్న ఇంప్రెషన్ ఇచ్చేలా ఆమె వ్యవహరించారు అని అంటున్నారు అలాగే ఆంధ్రా బిర్యాని చేసిన వ్యాఖ్యానాలు జాగృతి పేరుతో ఆమె చేస్తున్న హడావుడి అన్నీ మిస్ ఫైర్ అయ్యాయనే అంటున్నారు.
రాజకీయాల్లో ఎదగడానికి తొందర కూడదు, వేచి చూడాలి, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మొత్తానికి గడచిన కొద్ది కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఆమెని మరింతగా ఇబ్బంది పెట్టేవే తప్ప నిచ్చెన ఎక్కించేవి కావనే అంటారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాలలో మాటలు అదుపుగా పొదుపుగా వాడాలి. బ్యాలెన్స్ తప్పితే ఇలా ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉంటాయని అంటున్నారు. సో కవిత రాజకీయ కవిత మాత్రం ఎవరికీ అర్థం కాకుండానే ఉందని అంటున్నారు
