రోజుకో కథ.. కవిత రాజకీయాలు వ్యథ!
రోజుకో కథ.. గంటకో ప్రచారం.. ఇదీ.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి జరుగుతున్న రాజకీయం.
By: Tupaki Desk | 28 May 2025 11:17 AM ISTరోజుకో కథ.. గంటకో ప్రచారం.. ఇదీ.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి జరుగుతున్న రాజకీయం. ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం తెలంగాణలో రాజకీయాలు దాదాపు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన తర్వాత.. ఈ రాజకీయాలు శరవేగంగా చర్చలకు వస్తూనే ఉన్నాయి. ఏ ఇద్దరు కలిసినా.. కవిత గురించే ఏ నలుగురు కలిసినా.. తండ్రీకూతుళ్ల రాజకీయాల గురించే చర్చ.
ఫలితంగా.. ప్రభుత్వం సహా.. ఇతర రాజకీయ ప్రధాన అంశాలన్నీ పక్కదారి పట్టాయి. ఇక, కవిత రాజకీ యాలపై రోజుకో రకంగా.. కథనాలు, ప్రచారం జరుగుతూనే ఉంది. వీటిలో ఏది నిజం? ఏది అబద్ధం అనేది పక్కన పెడితే.. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందన్నది మాత్రం అంతు చిక్కని అంశంగా మారింది. గత ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కవిత రాజకీయాలకు సంబంధించిన ఎపిసోడ్లు సాగుతూనే ఉన్నాయి.
తొలినాళ్లలో తండ్రితో విభేదించి పార్టీ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇక, తెంపేసుకుంటున్నారని.. తండ్రి కూడా వదిలేశారని చర్చలు వచ్చాయి. ఆ తర్వాత ఎంపీ దామోదర్ రావు మధ్యవర్తిత్వంతో కవిత ఇక మారిపోయారని.. తండ్రిచాటునే రాజకీయాలు చేస్తారని చెప్పుకొచ్చారు. కొత్త పార్టీ పెట్టలేరని.. పెట్టరని కూడా కథనాలు హల్చల్ చేశాయి. కానీ, ఇంతలోనే మరో బాంబు లాంటి వార్త తెరమీదికి వచ్చింది. ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
అంతేకాదు.. దీనికి సంబంధించి ఓ మధ్యవర్తి ద్వారా ప్రయత్నం చేస్తున్నారన్న కథనాలు కూడా ప్రధాన మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. కానీ.. మరోవైపు కవిత వ్యవహారం చూస్తే.. కాంగ్రెస్‌ను తూర్పార బడుతున్నారు. కేటీఆర్‌ను పొగడ్తలతో కాకపోయినా.. వేరే రూపంలో వెనుకేసుకువస్తున్నారు. కేసీఆర్‌తోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉంటుందని అంటున్నారు. మరోవైపు.. ఆమె లీకులు ఇస్తున్నారు కాబట్టే.. ఇంతగా వార్తలు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మరి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాగా.. ఇలా.. రోజుకో కథ ద్వారా మాత్రం.. కవిత రాజకీయాలకు వ్యథ మిగిలే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. దీనికి ఎంత త్వరగా ఆమె ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిదని అంటున్నారు. కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటే.. ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. పెట్టుకోవచ్చు. లేదా.. వేరే పార్టీలో చేరాలని అనుకుంటే.. అది చేయొచ్చు. కానీ, ఇలా లీకులు ఇచ్చి వార్తలు రాయించుకుంటే మాత్రం.. రోజుకో విధంగా కవిత వ్యవహరిస్తే.. తెలంగాణ సమాజం లో ఆమె రాజకీయ ప్రస్థానంప్రమాదంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
